కోచ్గా ఎవరు కావాలో చెప్పండి..

6 Jul, 2017 11:40 IST|Sakshi
కోచ్గా ఎవరు కావాలో చెప్పండి..

ఆంటిగ్వా: మరొకొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీ నాటికి టీమిండియా ప్రధాన కోచ్ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. భారత జట్టుకు కోచ్ గా పని చేసిన అనిల్ కుంబ్లే ఇటీవల ఆకస్మికంగా తప్పుకున్న నేపథ్యంలో కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది. భారత్ కోచ్ కోసం రెండుసార్లు దరఖాస్తులు ఆహ్వానించి మరీ తగిన అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించింది.

దానిలో భాగంగా కోచ్గా ఎవరైతే బాగుండుందో ఆటగాళ్ల సలహా మేరకే ఎంపిక చేస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. టీమిండియా కోచ్ ఎంపికపై  తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని కోహ్లి పేర్కొన్నాడు. ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు.  కోచ్‌ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు.ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రాహుల్ జోహ్రి జమైకాకు వెళ్లనున్నారు. అక్కడ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నారు. గురువారం సాయంత్రం భారత క్రికెటర్లతో సమావేశమై కోచ్ ఎంపికపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇప్పటికే కోచ్ అభ్యర్ధిగా రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నాడు.

గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం రవిశాస్త్రికి లాభించనుంది. మరొకవైపు కోహ్లి కూడా రవిశాస్త్రి వైపే మొగ్గుచూపుతున్నారు. కాగా, కోచ్ పదవి కోసం రవిశాస్త్రికి వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీల నుంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కోచ్ అభ్యర్ధుల జాబితాను టీమిండియా ఆటగాళ్ల ముందుంచి అందుకు తగిన వ్యక్తి కోసం ఫీడ్ బ్యాక్ను తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు