వైజాగ్‌కు టెస్టు హోదా!

10 Jan, 2014 00:57 IST|Sakshi
వైజాగ్‌కు టెస్టు హోదా!

విశాఖపట్నం, న్యూస్‌లైన్: అంతర్జాతీయ వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన వైఎస్‌ఆర్ ఏసీసీ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఇప్పుడు టెస్టు హోదాకు చేరువవుతోంది. దానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతినిధి బృందం గురువారం స్టేడియంను సందర్శించి ఇక్కడి సౌకర్యాలపై దృష్టి పెట్టింది. బీసీసీఐ పరిశీలన కమిటీ కన్వీనర్, ఐపీఎల్ చైర్మన్ అయిన రంజీబ్ బిస్వాల్ నేతృత్వంలోని ఈ బృందం అవుట్ ఫీల్డ్, ప్రాక్టీస్ గ్రౌండ్స్, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లను పరిశీలించింది.
 
 బిస్వాల్‌తో పాటు బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎంవీ శ్రీధర్, మాజీ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్, బీసీసీఐ టీవీ డెరైక్టర్ జేమ్స్ రెగో కూడా మైదానాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. ఐపీఎల్-7లో కొన్ని మ్యాచ్‌లు వైజాగ్‌లో నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు బిస్వాల్ చెప్పారు. ‘ఇక్కడి అన్ని సౌకర్యాలను పూర్తిగా పరిశీలించాం. టెస్టు హోదా ఇచ్చేందుకు కావాల్సిన అన్ని అర్హతలు దీనికి ఉన్నాయి.
 
 త్వరలో మా నివేదికను బోర్డుకు సమర్పిస్తాం. అవకాశాన్ని బట్టి ఐపీఎల్‌కు వైజాగ్‌ను కూడా ఒక వేదికగా ఎంచుకుంటాం’ అని ఆయన చెప్పారు. ఎంవీ శ్రీధర్ కూడా స్టేడియం గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే వన్డే మ్యాచ్‌ల నిర్వహణకు వైజాగ్‌కు గుర్తింపు ఉందన్న ఆయన... మీడియా సెంటర్, మీడియా బాక్స్‌లో మార్పులు చేయాలని సూచించారు. బీసీసీఐ కమిటీ సందర్శన సమయంలో ఏసీఏ అధ్యక్షుడు డీవీ సుబ్బారావు, క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు