ప్రదర్శనను బట్టి ప్రోత్సాహకాలు!

2 Jul, 2015 00:13 IST|Sakshi
ప్రదర్శనను బట్టి ప్రోత్సాహకాలు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీలాంటి మేజర్ ఈవెంట్ గెలిచినప్పుడు బీసీసీఐ అప్పటికప్పుడు పెద్ద మొత్తంలో ఆటగాళ్లకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఇకపై ప్రతి సిరీస్ లేదా టోర్నీకి దీనిని అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ ముందుగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
 
 దీని ప్రకారం సొంతగడ్డపై గెలిచే సిరీస్‌లు, ఆటగాళ్ల పరుగులు, వికెట్లు, ఆ తర్వాత విదేశాల్లో విజయాలు... ఇలా ప్రదర్శన స్థాయిని బట్టి ప్రతీదానికీ నిర్దేశిత మొత్తాన్ని మ్యాచ్ ఫీజుతో పాటు ఆటగాళ్లకు అదనంగా అందిస్తారు. ప్రత్యర్థి, ఆడిన వేదిక, పరిస్థితులను కూడా ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటారు. బోర్డు ఫైనాన్స్ కమిటీ దీనికి ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ నెల 22న దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
 ‘ఎ’ గ్రేడ్‌లో మిథాలీరాజ్...
 మరోవైపు మహిళా క్రికెటర్లను ఎ, బి గ్రేడ్‌లుగా విభజిస్తూ ఫైనాన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న మిథాలీరాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున, ‘బి’ గ్రేడ్‌లోని ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 లక్షల చొప్పున వార్షిక ఫీజు రూపంలో చెల్లిస్తుంది.
 

మరిన్ని వార్తలు