అది నా చిన్ననాటి కల: గంభీర్‌

5 Feb, 2019 12:49 IST|Sakshi

న్యూఢిల్లీ: సుదీర్ఘకాలం భారత క్రికెట్‌ జట్టుకు సేవలందించిన క్రికెటర్లలో గౌతం గంభీర్‌ ఒకడు. ప్రధానంగా భారత్‌ గెలిచిన రెండు వరల్డ్‌కప్‌(2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌)ల్లో గంభీర్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ టాప్‌ స్కోరర్‌గా గంభీర్‌ నిలవడం ఇక్కడ మరో విశేషం. 2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 75 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన గంభీర్.. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 97 పరుగులు చేసి భారత్‌ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు.

అయితే భారత్ క్రికెట్‌ జట్టు వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండటమనేది తన చిన్ననాటి కలగా గంభీర్‌ పేర్కొన్నాడు. ‘ ఒక్కసారి నా క్రికెట్‌ కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే చాలా సంతృప్తిగా ఉంది. నాకు రెండేళ్లు వయసు ఉండగా భారత్‌ జట్టు తొలి వరల్డ్‌కప్‌ అందుకుంది. కానీ స్కూల్‌ డేస్‌ నుంచే వరల్డ్‌కప్‌ గెలిచే భారత జట్టులో ఉండాలనేది నా డ్రీమ్‌. ఆ ఏకైక కలతోనే పెరిగాను. చాలా ఎక్కువ సందర్భాల్లో ఆ కలను ఊహించుకుంటూ మేల్కోని వాడిని. మా బామ్మ కూడా ఏదొక రోజు నేను వరల్డ్‌కప్‌ ఆడతావని నాకు భరోసా ఇస్తూ ఉండేది. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను జీవితంలో సాధించిన గొప్ప ఘనత ఏదైనా ఉందంటే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉండటమే. అది రెండుసార్లు నెరవేరినందుకు నా సంతోషం డబుల్‌ అయ్యింది’ అని ఈ మాజీ క్రికెటర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు