పిలిస్తే... మళ్లీ వస్తాను

23 Jul, 2015 08:56 IST|Sakshi
పిలిస్తే... మళ్లీ వస్తాను

నా విధుల్లో జోక్యం చేసుకోవద్దు: హాకీ కోచ్ పాల్ వాన్ యాస్

 న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధికారులు మళ్లీ చీఫ్ కోచ్ పదవి చేపట్టాలని ఆహ్వానిస్తే... భారత్‌కు తిరిగి వస్తానని పాల్ వాన్ యాస్ తెలిపారు. తాను చీఫ్ కోచ్ పదవి నుంచి వైదొలగలేదని, తనపై హాకీ ఇండియా అధికారులే వేటు వేసి తప్పించారని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను. ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను ఆహ్వానిస్తారని అనుకోను. గతవారమే నాపై వేటు వేశారు. అయితే అధికారిక సమాచారం కోసం వేచి చూస్తున్నాను. ఏదీ జరిగినా నాకు సమ్మతమే. నా పదవి నుంచి దిగిపోయానని నేనెప్పుడూ చెప్పలేదు. నన్ను తప్పిస్తే నేనేం చేయాలి’ అని ప్రస్తుతం తన స్వస్థలం నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో ఉన్న పాల్ వాన్ యాస్ వివరించారు. ‘చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాలని మళ్లీ కోరితే తప్పకుండా వస్తాను.

అయితే దీనికి ముందు చాలా విషయాలపై చర్చ జరగాలి. నేను ముక్కుసూటి మనిషిని. నా కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నేను మంచి కోచ్ కాదు అని హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా వ్యాఖ్యానించారని తెలిసింది. తెలియని విషయాలపై బాత్రా అంచనాకు రాకూడదు. హాకీపై ఆయనకు అవగాహన లేదని ఇలాంటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని పాల్ తెలిపారు. ‘రియో ఒలింపిక్స్‌లో టీమిండియా నుంచి అద్భుతం చేసి చూపించాలనే తాపత్రయంతో చీఫ్ కోచ్ పదవిని స్వీకరించాను. భారత ఆటగాళ్లతో పనిచేసిన కాలం అద్భుతంగా సాగింది. భారత ఆటగాళ్లందరిలో సహజసిద్ధ నైపుణ్యం ఉంది. తనపై వేటు వేసిన విషయానికి సంబంధించిన పత్రాలను భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులకు మెయిల్ చేశాను. వారి ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నాను’ అని పాల్ వాన్ యాస్ వివరించారు.
 

మరిన్ని వార్తలు