టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారం

12 Aug, 2014 00:29 IST|Sakshi
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారం
  • పార్టీలకు అతీతంగా అభ్యంతరం
  • న్యూఢిల్లీ: క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ గైర్హాజరీపై రాజ్యసభలో సోమవారం కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సభకు మూడురోజులు మినహా సుదీర్ఘకాలంగా గైర్హాజరు కావడాన్ని పార్టీలకు అతీతంగా పలువురు సభ్యులు ఆక్షేపించారు. ఇది సభను, జాతిని అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. గత వారం పార్లమెంటు సమీపంలోనే జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టెండూల్కర్ సభకు మాత్రం రాకపోవడంపై ఆయన్ను వివరణ కోరాలన్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో సభకు హాజరుకాలేని స్థితిలో ఉన్నానని, అందుకు అనుమతించాలని తెండూల్కర్ పెట్టుకున్న దరఖాస్తుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సెలవు మంజూరు చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. 
     
    అంతకు ముందు టెండూల్కర్‌కు సెలవు మంజూరీకి సభ అనుమతించాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ కోరడంతో జీరో అవర్‌లో ఈ అంశం ప్రస్తావన కు వచ్చింది. సోదరుడికి గుండె ఆపరేషన్ జరగటంతో పాటు వృత్తిపరమైన పరిమితులవల్ల ప్రస్తుత సమావేశాలకు రాలేనని, ఇందుకు తనను అనుమతించాలని సచిన్ సెలవు దరఖాస్తు పంపినట్టు కురియన్ ప్రకటించారు.  ఈ కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు సెలవు మంజూరు చేశారు.
     
    టెండూల్కర్‌పైనే రచ్చ ఎందుకు?: కాంగ్రెస్
    ఇదిలా ఉండగా, గైర్హాజరీపై సచిన్ టెండూల్కర్‌కు సెలవు మంజూరు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. పలువురు రాజ్యసభ సభ్యులు సెలవులో ఉన్నారని, వారు సెలబ్రిటీలు కాదు కాబట్టి వారిని ఎవరూ ఎత్తిచూపడంలేదని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు.
మరిన్ని వార్తలు