‘వచ్చే ఏడాది కూడా ధోని ఆడతాడు’

19 Jan, 2020 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: చాలా కాలంగా భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌పైనే. మళ్లీ భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడతాడా.. లేదా అనే విషయంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటే ఇటీవల ధోనిని ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ జాబితాను తొలగించారు.  2019 అక్టోబర్‌ నుంచి 2020 సెప్టెంబర్‌ వరకూ భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించిన బీసీసీఐ అందులో ధోనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో ధోని పేరు కాంట్రాక్ట్‌ లిస్టులో లేకపోవడం విస్మయానికి గురి చేసింది. ధోని శకం ముగిసిందంటూ వార్తలు కూడా వచ్చాయి.  దీనిపై ధోనికి సమాచారం ఇచ్చిన తర్వాత అతన్ని తొలగించినట్లు బీసీసీఐలోని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 

ఇదిలా ఉంచితే, బీసీసీఐ తనను కాంట్రాక్ట్‌ జాబాతా నుంచి తప్పించిన రోజే ధోని క్రికెట్‌ బ్యాట్‌ పట్టాడు. రాంచీలోని జార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసిన ధోని అక్కడ వైట్‌బాల్‌తో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసేవాడు. అంటే ఐపీఎల్‌కు సన్నద్ధం అవుతున్న విషయాన్ని ధోని చెప్పకనే చెప్పేశాడు. కాగా, ధోని ఈ ఏడాదే కాదు.. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ ఆడతాడని అంటున్నారు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌. 2020 ఐపీఎల్‌తో పాటు 2021 ఐపీఎల్‌లో కూడా ధోని తమ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని శ్రీనివాసన్‌ స్పష్టం చేశారు. శనివారం ఒక ఈవెంట్‌కు హాజరైన శ్రీనివాసన్‌.. ధోని ఐపీఎల్‌ భవితవ్యంపై క్లారిటీ ఇచ్చారు. ధోనిపై తమకు నమ్మకం ఉందని, వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్లలో తాము ధోని నేతృత్వంలోనే బరిలోకి దిగుతామన్నారు. (ఇక్కడ చదవండి: ‘సారీ బ్రదర్‌.. ఆ విషయంపై మాట్లాడను’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు