ఈడెన్ గార్డెన్స్... లార్డ్స్‌లాంటిది

20 Oct, 2014 00:55 IST|Sakshi
ఈడెన్ గార్డెన్స్... లార్డ్స్‌లాంటిది

ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కితాబు

 న్యూఢిల్లీ: భారత్‌లో ఆధునిక హంగులతో ఎన్నో కొత్త మైదానాలు పుట్టుకొస్తున్నా... ఉపఖండంలో మాత్రం ఈడెన్ గార్డెన్స్ అత్యుత్తమ గ్రౌండ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా కితాబిచ్చాడు. ‘భారత్‌లో నా చివరి పర్యటన సందర్భంగా ఈడెన్‌లో 90 వేల మంది ప్రేక్షకుల ముందు ఐదు రోజులు మ్యాచ్ ఆడా. ఉపఖండానికి ఇది లార్డ్స్‌లాగా అనిపించింది. ప్రపంచ క్రికెటర్లకు ఇది అద్భుతమైన ప్రదేశం. ఈడెన్‌లో సెంచరీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కార్పెట్‌ను పోలిన అవుట్ ఫీల్డ్ అద్భుతం’ అని ‘సలామ్ క్రికెట్’లో పాల్గొన్న వా పేర్కొన్నాడు.

 భారత్, ఆసీస్ ఫైనల్ ఆడతాయి: పాంటింగ్
 వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతుందని మరో సారథి రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందన్నాడు. అయితే సొంతగడ్డపై ఆడుతుండటంతో క్లార్క్ సేన చాంపియన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ఈ టోర్నీలో పవర్ హిట్టర్ డేవిడ్ వార్నర్ కీలకం కానున్నాడని తెలిపాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేమని చెప్పిన ‘పంటర్’... పేసర్లు, ఆల్‌రౌండర్లతో ఆ జట్టు పటిష్టంగా ఉందన్నాడు.

 1983 విజయం స్ఫూర్తినిచ్చింది: రణతుంగ
 కపిల్‌సేన 1983లో సాధించిన ప్రపంచకప్ విజయం తాము వన్డేల్లో రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచిందని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నాడు. ‘కపిల్ ప్రపంచకప్‌ను పట్టుకోవడం కళ్లారా చూశా. భారత్‌లాంటి జట్టు పటిష్టమైన విండీస్‌ను ఓడించగా లేనిది.... లంక ప్రపంచకప్ ఎందుకు గెలవలేదని ఆలోచించా. అలా 1996లో మేం దాన్ని సాధించి చూపాం.  పాక్ కూడా 1992లో కప్ గెలిచింది. ఇమ్రాన్ జట్టును నడిపిన తీరు అమోఘం. నేను కూడా అలా జట్టును ముందుకు తీసుకెళ్లలేనా? అని మదనపడ్డా. ఇలా చాలా అంశాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయి’ అని రణతుంగ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు