ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి..

5 Jan, 2020 16:20 IST|Sakshi

స్టోక్స్‌ సరికొత్త రికార్డు

కేప్‌టౌన్‌:  ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా నూతన అధ్యాయాన్ని లిఖించాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకున్నాడు. దాంతో టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను పట్టుకున్న తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా(వికెట్‌ కీపర్లను మినహాయించి) రికార్డు నెలకొల్పాడు.

ఇలా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఐదు క్యాచ్‌లను అందుకోవడం ఇదే తొలిసారి. 1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లండ్‌ ఇప్పటివరకూ 1019 టెస్టులు ఆడింది. అయితే ఒక ఇన్నింగ్స్‌లో ఒక ఇంగ్లండ్‌  క్రికెటర్‌ నాలుగు క్యాచ్‌లను  ఇప్పటివరకూ 23సార్లు సందర్భాల్లో అందుకోగా, ఐదు క్యాచ్‌లను మాత్రం పట్టుకోలేదు. గతేడాది ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ నాలుగు క్యాచ్‌లను చివరిసారి అందుకున్నాడు. తాజాగా స్టోక్స్‌ ఐదు క్యాచ్‌లను అందుకుని కొత్త చరిత్రను లిఖించాడు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో హమ్జా, డుప్లెసిస్‌,  వాన్‌డెర్‌ డస్సెన్‌, ప్రిటోరియస్‌, అన్రిచ్‌ నార్త్‌జీల క్యాచ్‌లను స్టోక్స్‌ పట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 89 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.  ఫలితంగా ఇంగ్లండ్‌ 46 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటగా, స్టువర్ట్‌ బ్రాడ్‌, సామ్‌ కర్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.(ఇక్కడ చదవండి: స్టోక్స్‌-బ్రాడ్‌ల వాడివేడి వాగ్వాదం.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు