కిర్‌స్టెన్‌ మళ్లీ వస్తున్నాడా?

19 Dec, 2018 20:04 IST|Sakshi

ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్‌ మరోసారి టీమిండియా కోచ్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సారి పురుషుల జట్టుకు కాకుండా మహిళల జట్టుకు కోచ్‌ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. భారత మహిళల జట్టుకు నూతన కోచ్‌ నియామకంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇప్పుటికే కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిని బీసీసీఐ సెలక్షన్‌ ప్యానల్‌ ఇంటర్వ్యూ చేయనుంది. అందుబాటులో లేని వారు స్కైప్‌ ద్వారా కూడా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది.  (కోచ్‌గా పొవార్‌నే కొనసాగించండి: హర‍్మన్‌ లేఖ)

ఇంటర్వ్యూ జాబితాలో టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌తోపాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్‌ హెర్షల్‌ గిబ్స్‌, తాజా మాజీ కోచ్‌ రమేశ్‌ పొవార్‌, రామన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, మనోజ్‌ ప్రభాకర్‌, ట్రెంట్‌ జాన్స్టన్‌, మార్క్ కోల్స్, బ్రాడ్‌ హాగ్‌, డిమిట్రి మస్కరెన్హాస్‌లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. కోచ్‌ పదవి కోసం ఏర్పాటు చేసిన బీసీసీఐ సెలక్ష​న్‌ ప్యానల్‌లో టీమిండియా మాజీ ఆటగాళ్లు కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. (పొవార్‌ కోచింగ్‌ ముగిసింది...)

మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్‌ అవసరం లేదంటూ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డియానా ఎడుల్జీ వాదిస్తున్నా.. చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ మాత్రం పొవార్‌ కోచింగ్‌పై సుముఖత వ్యక్తం చేయటం లేదు. దీంతో భారత మహిళల క్రికెట్‌ నూతన కోచ్‌ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ)

కిర్‌స్టెన్‌కే అవకాశం?
మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌ గెలిచినప్పుడు గ్యారీ కిర్‌స్టెన్‌ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్‌లో అనుభవరీత్యా కోచ్‌​ పదవి కిర్‌స్టెన్‌నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్‌ పొవార్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్‌గా నియమించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. అయితే టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్‌కు కలిసొచ్చే అంశం. సఫారీ మాజీ ఓపెనర్‌ హెర్షల్‌ గిబ్స్‌కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. స్వదేశీ కోచ్‌నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్‌ ప్రసాద్‌, మనోజ్‌ ప్రభాకర్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.   (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్‌)

మరిన్ని వార్తలు