జర్మనీ జిగేల్...

17 Jun, 2014 00:38 IST|Sakshi
జర్మనీ జిగేల్...

సమష్టితత్వానికి సమన్వయం తోడైంది. హోరాహోరీ పోరు కాస్తా ఏకపక్షమైంది. ఒక్కడిపై ఆధారపడకుండా జట్టుగా, కలసికట్టుగా ఆడిన జర్మనీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో జిగేల్‌మంది. 1990 నుంచి వరుసగా ఏడో ప్రపంచకప్‌లోనూ తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు రొనాల్డోనే నమ్ముకున్న పోర్చుగల్‌కు ఈ స్టార్ ప్లేయర్ వైఫల్యంతో నిరాశ తప్పలేదు..
 
 4-0తో పోర్చుగల్‌పై ఘనవిజయం

- ముల్లర్ ‘హ్యాట్రిక్’
- ప్రపంచకప్‌లో జర్మనీ ‘సెంచరీ’
- ఈ ఘనత సాధించిన తొలి జట్టు
- తేలిపోయిన క్రిస్టియానో రొనాల్డో

సాల్వడార్: రెండు దశాబ్దాల నుంచి ఊరిస్తున్న ప్రపంచకప్‌ను ఈసారి సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన జర్మనీ శుభారంభం చేసింది. అంచనాలకు అనుగుణంగా ఆడి తొలి మ్యాచ్‌లో భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘జి’లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫిలిప్ లామ్ నాయకత్వంలోని జర్మనీ 4-0 గోల్స్ తేడాతో పోర్చుగల్‌ను చిత్తు చేసింది. జర్మనీ తరఫున థామస్ ముల్లర్ మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... హమెల్స్ ఒక గోల్ సాధించాడు.
- ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్ చరిత్రలో 100వ మ్యాచ్ ఆడిన ఏకైక జట్టుగా గుర్తింపు పొందిన జర్మనీ అన్ని విభాగాల్లో పోర్చుగల్‌ను వెనక్కి నెట్టింది.
- గత మూడు ప్రపంచకప్‌లలో కనీసం సెమీఫైనల్‌కు చేరుకున్న జర్మనీ తొలి మ్యాచ్‌లోనే దూకుడైన ఆటతీరుతో తమ ఉద్దేశమేంటో చాటిచెప్పింది. ఆరంభం నుంచే గోల్ చేయడమే లక్ష్యంగా పోర్చుగల్ గోల్‌పోస్ట్‌పై దూసుకెళ్లింది.
- ఎడతెరిపి దాడుల ఫలితం జర్మనీకి 12వ నిమిషంలో లభించింది. ‘డి’ ఏరియాలో జర్మనీ ఆటగాడు మారియో గోట్జీని పోర్చుగల్ డిఫెండర్ పెరీరా మొరటుగా అడ్డుకున్నాడు. దాంతో రిఫరీ పెరీరాకు ఎల్లో కార్డు ఇవ్వడంతోపాటు జర్మనీకి ‘పెనాల్టీ కిక్’ను ఇచ్చారు. థామస్ ముల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని నేర్పుగా లక్ష్యానికి చేర్చడంతో జర్మనీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో తామే మొదటి గోల్ చేయడం ఇది జర్మనీకిది 60వ సారి. దాంతో 59 సార్లతో బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది.
 
- ఖాతా తెరిచిన ఆనందంలో జర్మనీ జోరు కొనసాగిం చగా... పోర్చుగల్ ఆటగాళ్లు తేలిపోయారు. స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఉన్నప్పటికీ అతనికి సహచరుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు.
- ఆట 32వ నిమిషంలో జర్మనీ రెండో గోల్ చేసింది. క్రూస్ సంధించిన కార్నర్ షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న హమెల్స్ ‘హెడర్’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు.
- జర్మనీ ఆటగాళ్ల దూకుడును ఎలా నిలువరించాలో పోర్చుగల్ ఆటగాళ్లకు అర్ధంకాలేదు. అసహనంతో తప్పిదాలు చేశారు. 37వ నిమిషంలో జర్మనీ ఆటగాడు ముల్లర్‌ను తలతో ఢీకొట్టిన పెపెకు రిఫరీ ‘రెడ్ కార్డు’ ఇచ్చి మైదానం బయటకు పంపించారు.
-  పెపె నిష్ర్కమణతో 10 మంది ఆటగాళ్లకే పరిమితమైన పోర్చుగల్ తేరుకోలేకపోయింది. తొలి అర్ధభాగంలోని అదనపు సమయంలో జర్మనీ ఖాతాలో మూడో గోల్ చేరింది. ‘డి’ ఏరియాలో పోర్చుగల్ డిఫెండర్ అల్వెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంతిని దొరకబుచ్చుకున్న థామస్ ముల్లర్ మిగతా పనిని పూర్తి చేశాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి జర్మనీ 3-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది.
- రెండో అర్ధభాగంలోనూ జర్మనీ ఆధిపత్యం చలాయించింది. 78వ నిమిషంలో ముల్లర్ మూడో గోల్ చేయడంతో జర్మనీ ఆధిక్యం 4-0కు పెరిగింది.

షుమాకర్ కోసం..!
 గత ఆరు నెలలుగా కోమాలో ఉండి సోమవారం సృహలోకి వచ్చిన తమ దేశానికే చెందిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌కు ప్రపంచకప్‌ను కానుకగా ఇస్తామని మ్యాచ్‌కు ముందు జర్మనీ స్టార్ ప్లేయర్ పొడోల్‌స్కీ పేర్కొన్నాడు. తొలి మ్యాచ్‌లో జర్మనీ జోరు చూశాక ఈసారి ఆ జట్టు అనుకున్న ఫలితం సాధించేలా కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు