క్యాబ్‌లో వెళ్లేందుకు... అప్పుడు నా దగ్గర డబ్బేది!

27 Apr, 2016 08:36 IST|Sakshi
క్యాబ్‌లో వెళ్లేందుకు... అప్పుడు నా దగ్గర డబ్బేది!

పన్నెండేళ్ల ప్రాయంలోని సచిన్ మనోగతం
ముంబై: సచిన్ టెండూల్కర్ ఓ దిగ్గజం. అంతేనా.... అంటే కాదు ఇంకా చాలానే ఉంది. అతను బ్యాటింగ్‌లో గ్రేటెస్ట్, పరుగుల్లో ఎవరెస్ట్, ఆర్జనలో రిచెస్ట్... అయితే ఇవన్నీ ఇప్పటి మాటలు. మరి 30 ఏళ్ల క్రితం... అందరిలాగే ఓ సాధారణ పిల్లాడు. 12 ఏళ్ల కుర్రాడు. ఇప్పుడు కోటిన్నర విలువచేసే ఫెరారీ కారులో తిరిగినా... ఐదు కోట్ల రోల్స్ రాయిస్‌లో చక్కర్లు కొట్టినా పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే అతను భారత్‌లోనే అత్యంత ధనవంతమైన క్రీడాకారుడు. మరి ఆ రోజుల్లో... మూడు దశాబ్దాల క్రితం... ఓ అద్దె కారులో కూడా వెళ్లలేకపోయేంతటి సాధారణ జీవితం.

ఇదే విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. మంగళవారం డీబీఎస్ బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన ‘డిజిబ్యాంక్’ కార్యక్రమంలో తన బాల్యాన్ని ఇలా పంచుకున్నాడు. ‘నాకపుడు సరిగ్గా పన్నెండేళ్లు. ముంబై అండర్-15 జట్టుకు ఎంపికయ్యా. పట్టరాని సంతోషం. ఇంకేముంది... జేబులో మామూలు అవసరాలు తీరే డబ్బులతో పుణెకు వెళ్లా. అక్కడప్పుడు బాగా వర్షం కురిసింది. మొత్తానికి ఆటమొదలై నా వరకు వచ్చేసరికి క్రీజులోకెళ్లిన నేను 4 పరుగుల వద్ద రనౌటయ్యా.

ఏం చేస్తాం. ఆ ప్రాయంలో అంతగా పరుగు పెట్టలేకపోయా. చాలా నిరాశతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశా. తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. కారణం వర్షం. ఇక ఇంటిముఖం తప్ప చేయడానికేమీ లేదు. దీంతో సినిమా, చిరుతిండికే తెచ్చిన డబ్బు అయిపోయింది. దేనికెంత ఖర్చు చేయాలో అప్పుడేం తెలుసు మరి. రెలైక్కి ముంబై చేరుకున్న నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దాదర్ స్టేషన్ నుంచి రెండు బ్యాగుల్ని భుజాన వేసుకొని శివాజీ పార్క్‌కు నడుచుకుంటూ వెళ్లాను.

ఎందుకంటే క్యాబ్‌లో వెళ్లెందుకు జేబులో డబ్బులుండాలిగా’ అని ఈ బ్యాటింగ్ మేధావి సెల్‌ఫోన్లు లేని రోజుల్ని వివరించాడు. అప్పుడే సెల్‌ఫోన్‌లు ఉంటే తాను ఎస్సెమ్మెస్‌తోనూ, ఫోన్ కాల్‌తోనూ తన తల్లిదండ్రుల్ని సంప్రదించి డబ్బుల్ని అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవాడ్నని చెప్పుకొచ్చాడు. జీవితంలోనే కాదు... క్రికెట్‌లో టెక్నాలజీ ఆవిష్కరణలు పెను మార్పులు తెచ్చాయన్నాడు. 1992లో థర్డ్ అంపైర్ (టీవీ రిప్లే చూసి నిర్ణయించడం), తదనంతరం కంప్యూటర్‌తో ప్రణాళిక వ్యూహాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మార్పులే వచ్చాయని అన్నాడు.

మరిన్ని వార్తలు