'పూర్' అని ఎలా అంటారు?

11 Mar, 2017 11:51 IST|Sakshi
'పూర్' అని ఎలా అంటారు?

పుణె: ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య  తొలి టెస్టు జరిగిన పుణె పిచ్ నాసిరకమైనదంటూ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఇవ్వడాన్ని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్రంగా తప్పుబట్టింది. అసలు పుణె పిచ్ నాసిరకంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఏ రకంగా నిర్దేశించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి శుక్రవారం సమర్పించిన నివేదికలో బీసీసీఐ గట్టిగా నిలదీసింది.


'పుణె మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిన మాట వాస్తవం. భారత్ స్వల్ప స్కోర్లకే పరిమితమైంది కూడా నిజమే. మరి ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసింది కదా. తొలి ఇన్నింగ్స్ లో 260, రెండో ఇన్నింగ్స్ లో 285 స్కోర్లు నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేశాడు.భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అసలు పూర్ పిచ్ అంటే అర్థమేమిటి. ఇక్కడ ఏమైనా ఊహించని బౌన్స్ వచ్చిందా. బ్యాట్స్ మన్లు తీవ్రంగా ఇబ్బంది పడటం పుణె లో జరిగిందా?అని బీసీసీఐ సీనియర అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

ఇది మ్యాచ్ రిఫరీ చెప్పినట్లు ఎంతమాత్రం పూర్(నాసిరకం) పిచ్ కాదని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని  ఐసీసీ ముందు ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.


ఆసీస్ -భారత్ మధ్య తొలి టెస్టు జరిగిన పుణె పిచ్‌ను నాసిరకమైనదిగా ఐసీసీ రేటింగ్‌ ఇచ్చింది. టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ తన నివేదికను ఐసీసీకి అందజేశారు. ‘ఐసీసీ పిచ్, అవుట్‌ ఫీల్డ్‌ నిర్వహణకు సంబంధించిన క్లాజ్‌–3 ప్రకారం బ్రాడ్‌ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. దీనిపై ఐసీసీకి నివేదికి సమర్పించిన బీసీసీఐ. పుణె పిచ్ రూపకల్పనలో ఏమాత్రం తప్పు జరగలేదని పేర్కొంది. దాంతో పాటు పిచ్ నాసిరకమైన కాదని ఐసీసీకి దీటైన సమాధానం ఇచ్చింది బీసీసీఐ.

మరిన్ని వార్తలు