భారత్‌-వెస్టిండీస్‌ సిరీస్‌లో కొత్త రూల్‌

5 Dec, 2019 17:30 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హైదరాబాద్‌ :  గత కొంత కాలంగా ఫీల్డ్‌ అంపైర్లు నో బాల్స్‌ను గుర్తించడంలో పదేపదే విఫలమవుతున్నారనే ఆరోపణలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్‌ అంపైర్‌కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌​లలో దీనిని ట్రయల్‌ చేయనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం జరిగే భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య జరిగే తొలి టీ20 నుంచే ఈ కొత్త నిబంధనకు అంకురార్పణ జరగనుంది. ఈ సిరీస్‌లతో పాటు కొన్ని నెలలు ఈ నిబంధనను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్‌ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఈ నిబంధన ప్రకారం థర్డ్‌ అంపైర్‌ ఫ్రంట్‌ ఫుట్‌ బాల్‌ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్‌అంపైర్‌తో చర్చించకుండా ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్‌ ఔటైన బంతి నోబాల్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటిస్తే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్‌ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే కొనసాగుతాయి’అంటూ ఐసీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంతకాలంగా నో బాల్స్‌ అంశంలో వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 21  ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించలేకపోయారు. దీంతో అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తాయి. సెకన్‌ కాలంలో నోబాల్‌, బాల్‌ లెంగ్త్‌, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటివి గమనించడం కష్టతరంగా మారిందని అంపైర్లు వాపోయారు. దీంతో ఈ బాధ్యతను థర్డ్‌ అంపైర్‌కు అప్పగించాలని పలువురు సూచించారు. దీంతో నోబాల్‌ అంశాన్ని  కొన్ని నెలల పాటు థర్డ్‌ అంపైర్‌కు అప్పగించాలని ఐసీసీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ నిర్ణయంపై మాజీ ఆసీస్‌ అంపైర్‌ సైమన్‌ టఫెల్‌ పెదవి విరిచాడు. ఇప్పటికే డీఆర్‌ఎస్‌, రనౌట్స్‌ వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్న థర్డ్‌ అంపైర్లపై ఈ నిబంధన మరింత భారం పెంచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మరో ప్రత్యామ్నాయం చూస్తే బెటర్‌ అని సూచించాడు. ఇక ఈ ట్రయల్స్‌ విజయవంతం అయితే భవిష్యత్‌లో నోబాల్స్‌కు సంబంధించి పూర్తి బాధ్యతలు థర్డ్‌ అంపైర్‌కే అప్పగించే అవకాశం ఉంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు