స్టీవ్‌ స్మిత్‌ ఆర్డర్‌ మారనుంది..

13 Jan, 2020 11:41 IST|Sakshi

ముంబై: టీమిండియాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. భారత్‌ను వారి గడ్డపై ఓడించాలంటే కట్టుదిట్టమైన ప్రణాళికతో బరిలోకి దిగాలని భావిస్తున్న ఆసీస్‌.. ఆ మేరకు తమ గేమ్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటుంది. భారత్‌తో సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. భారత్‌పై కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంతో పాటు వికెట్‌ను కూడా తొందరగా ఇవ్వకూడదనే ఉద్దేశంతో స్మిత్‌ను మూడో స్థానంలో పంపేందుకు రంగం సిద్ధం చేశారు. 2018 నుంచి స్మిత్‌ ఎక్కువగా నాల్గో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. 

అయితే గతంలో మూడో స్థానంలో ఆడిన స్మిత్‌ను అదే స్థానంలో పంపాలనే సీఏ మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే నిర్ణయించింది. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటివరకూ 8 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలతో 3,810 పరుగులు చేసిన స్మిత్‌.. 41.41 యావరేజ్ కల్గి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 164. ఇక టెస్టు ఫార్మాట్‌లో ఇరగదీస్తూ వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న లబూషేన్‌ను స్మిత్‌ తర్వాత స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మూడో స్థానంలో స్మిత్‌ను పంపితే, నాల్గో స్థానంలో లబూషేన్‌ న్యాయం చేస్తాడని ఆసీస్‌ భావిస్తోంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. 

మరిన్ని వార్తలు