కోహ్లి భారీ సెంచరీ

15 Jan, 2018 16:54 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల వద్ద ఆలౌటైంది. 183/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా.. మరో 124 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్ల నష్టపోయింది. విరాట్‌ కోహ్లి(153; 217 బంతుల్లో 15 ఫోర్లు‌) భారీ సెంచరీ చేయడంతో భారత జట్టు మూడొందల పరుగుల మార్కును చేరింది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన కోహ్లి.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒకవైపు వికెట‍్లు పడుతున్న కోహ్లి మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ రోజు  తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాకు మ్యాచ్‌ ఆరంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే షాక్‌ తగిలింది. హార్దిక్‌ పాండ్యా తన స్వీయతప్పిదంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 209 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన అశ్విన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిసి 71 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జత చేశాడు. అయితే జట్టు 280 పరుగుల వద్ద ఉండగా అశ్విన్‌(38;54 బంతుల్లో 7 ఫోర్లు) ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో మొహ్మద్‌ షమీ(1)కూడా అవుటయ్యాడు. అటు తరువాత ఇషాంత్‌ శర్మ(3; 20 బంతుల్లో) కలిసి 25 పరుగుల్ని జత చేశాడు. చివరి వికెట్‌గా కోహ్లి అవుట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంకా భారత్‌ 28 పరుగుల వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో మోర్నీ మోర్కెల్‌ నాలుగు వికెట్లు సాధించగా, ఎన్‌గిడి, రబడా, ఫిలిండర్‌, మహరాజ్‌లకు తలో వికెట్‌ దక్కింది.
 

>
మరిన్ని వార్తలు