టీమిండియాకు బోణీయే కరువాయె

31 Jan, 2014 15:04 IST|Sakshi
టీమిండియాకు బోణీయే కరువాయె

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భారత బోణీ కల నెరవేరలేదు. ధోనీసేన మరోసారి చిత్తుగా ఓడింది.  సిరీస్‌ పోయింది.. పరువూ పోయింది.. నంబర్‌ వన్‌ ర్యాంకూ గల్లంతైంది. వెల్లింగ్టన్‌లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియా ఓడింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ మరోసారి కలిసికట్టుగా విఫలమై.. టీమ్‌ కొంప ముంచారు. శుక్రవారమిక్కడ జరిగిన చివరి, ఐదో వన్డేలో భారత్ 87 పరుగులతో కివీస్ చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఇంతకుముందు సిరీస్ ను సొంతం చేసుకున్న కివీస్ ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. మూడో వన్డే టైగా ముగియగా, మిగిలిన మ్యాచ్ ల్లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.

చివరి మ్యాచ్ లో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన మరో రెండు బంతులు మిగులుండగా 216 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (82), ధోనీ (47) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. తెలుగుతేజం అంబటి రాయుడు 20, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. కివీస్ బౌలర్ హెన్నీ నాలుగు వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్ను విలియమ్సన్, రాస్ టేలర్ ఆదుకున్నారు. టేలర్(102) సెంచరీ, విలియమ్సన్(88) అర్థ సెంచరీ సాధించారు. నీషమ్ 34, గుప్తిల్ 16, రైడర్ 17, రోంచి 11 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆరోన్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లి తలో వికెట్ తీశారు.
 

మరిన్ని వార్తలు