భారత హాకీ జట్టు సగర్వంగా...

9 Aug, 2016 23:16 IST|Sakshi
భారత హాకీ జట్టు సగర్వంగా...

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్తోంది. అర్జెంటీనాతో మంగళవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో 2-1తో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. అయితే 2009 తర్వాత అర్జెంటీనాను భారత్‌ ఓడించడం ఇదే తొలిసారి. తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను చింగల్‌సేన(7వ నిమిషం) గోల్‌ చేయగా, 34వ నిమిషంలో కోఠాజిత్‌ ఖడంగ్బం గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

మ్యాచ్ ఆరంభం నుంచీ భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా మధ్యలో గొంజాల్ పిలేట్ గోల్ చేయడంతో అర్జంటీనా ఖాతా తెరిచింది. దీంతో భారత్ తమ దాడులను మరింత పెంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచింది. భారత గోల్‌కీపర్‌, కెప్టెన్‌ శ్రీజేశ్‌ అర్జెంటీనా గోల్‌ అవకాశాలను నెట్ వద్ద సమర్థంగా అడ్డుకున్నాడు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది.  అయితే అర్జెంటీనాకు మరో అవకాశం ఇవ్వకుండా 2-1తో భారత్ మ్యాచ్ సొంతం చేసుకుంది. భారత్ తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అర్జెంటీనాపై విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం హాలెండ్ తో భారత్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని వార్తలు