భారత్‌ పసిడి వేట

7 Dec, 2019 03:31 IST|Sakshi

దక్షిణాసియా క్రీడల ఆరో రోజు 19 స్వర్ణాలు

బ్యాడ్మింటన్‌లో సిరిల్‌ వర్మకు పసిడి పతకం

కఠ్మాండు (నేపాల్‌): బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్‌లోనూ పైచేయి సాధిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల వేటను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రీడల ఆరో రోజు శుక్రవారం భారత్‌ 19 స్వర్ణాలు, 18 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 41 పతకాలు సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ప్రస్తుతం భారత్‌ 81 స్వర్ణాలు, 59 రజతాలు, 25 కాంస్యాలతో కలిపి మొత్తం 165 పతకాలతో ‘టాప్‌’లో కొనసాగుతోంది.  శుక్రవారం బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ స్వర్ణం నెగ్గాడు. ఫైనల్లో సిరిల్‌ వర్మ 17–21, 23–21, 21–13తో ఆర్యమాన్‌ టాండన్‌ (భారత్‌)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో పుల్లెల గాయత్రి రజతం దక్కించుకుంది.

ఫైనల్లో అషి్మత (భారత్‌) 21–18, 25–23తో గాయత్రిని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ గారగ కృష్ణప్రసాద్‌–ధ్రువ్‌ కపిల (భారత్‌) జంట 21–19, 19–21, 21–18తో సచిన్‌ డయాస్‌–బువనెక (శ్రీలంక) జోడీపై గెలిచి బంగారు పతకం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తెలుగమ్మాయి జక్కంపూడి మేఘన–ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 21–16, 21–14తో సచిన్‌ డయాస్‌–ప్రమోదిక (శ్రీలంక) జంటపై నెగ్గి పసిడి పతకం సాధించింది. అథ్లెటిక్స్‌లో తేజిందర్‌ పాల్‌ పురుషుల షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచాడు.

తేజిందర్‌ ఇనుప గుండును 20.03 మీటర్ల దూరం విసిరి ధక్షిణాసియా క్రీడల రికార్డును నెలకొల్పి విజేతగా నిలిచాడు. మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కే చెందిన అభా ఖతువా పసిడి పతకం గెలిచింది. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు స్వర్ణాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్‌ 4–3తో హరీ్మత్‌ దేశాయ్‌ (భారత్‌)పై, మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సుతీర్థ 4–2తో ఐహిక ముఖర్జీ (భారత్‌)పై గెలిచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో అచింత షెయులి (పురుషుల 73 కేజీలు), రాఖీ హల్దర్‌ (మహిళల 64 కేజీలు), మన్‌ప్రీత్‌ కౌర్‌ (మహిళల 71 కేజీలు) స్వర్ణ పతకాలు గెలిచారు. 

మరిన్ని వార్తలు