రెండోసారీ రన్నరప్‌తో సరి

29 Jan, 2018 04:52 IST|Sakshi

ఫైనల్లో బెల్జియం చేతిలో భారత్‌ ఓటమి

హామిల్టన్‌: నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ రెండో అంచె టోర్నమెంట్‌లోనూ భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియంతో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా పెనాల్టీ షూటౌట్‌లో 0–3తో పరాజయం పాలైంది. తొలి అంచె టోర్నమెంట్‌ ఫైనల్లోనూ భారత్‌కు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైన సంగతి విదితమే. రెండో అంచె టోర్నీ లీగ్‌ దశలో బెల్జియంపై సంచలన విజయం సాధించిన భారత్‌ ఈసారి ఫైనల్లోనూ ఆ జట్టుకు గట్టిపోటీనే ఇచ్చింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 4–4తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు.

షూటౌట్‌లో బెల్జియం తరఫున ఫెలిక్స్, సెబాస్టియన్, అర్థుర్‌ వాన్‌ డోరెన్‌ సఫలమయ్యారు. భారత్‌ తరఫున ఎవరూ గోల్‌ చేయలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. పోటా పోటీగా సాగిన పోరులో ఎక్కువ శాతం భారత్‌దే పైచేయి అయింది. భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ (29వ, 53వ ని.లో) రెండు గోల్స్, నీలకంఠ శర్మ (42వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (49వ ని.లో) చెరో గోల్‌ చేశారు. బెల్జియం తరఫున తాంగై కాసిన్స్‌ (41వ ని.లో), కెడ్రిక్‌ చార్లైర్‌ (43వ ని.లో), అమౌరి కౌస్టర్స్‌ (51వ ని.లో), ఫెలిక్స్‌ (56వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.   

మరిన్ని వార్తలు