జడేజా విజృంభణ

6 Mar, 2017 11:37 IST|Sakshi
జడేజా విజృంభణ

బెంగళూరు: రెండో టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా విజృంభించడంతో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్ లో 276 పరుగులకు ఆలౌటైంది. 237/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ మరో 39 పరుగులు మాత్రమే చేసి మిగతా నాలుగు వికెట్లను చేజార్చుకుంది. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లను జడేజా సాధించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ తొలి సెషన్ లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఓవరాల్ గా ఆరు వికెట్లతో ఆసీస్ వెన్నువిరవగా, అశ్విన్ కు రెండు వికెట్లు లభించాయి. భారత పేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ లు తలో వికెట్ తీశారు.



ఏడు పరుగులు వ్యవధిలో నాలుగు వికెట్లు

ఈ రోజు ఆసీస్ ఇన్నింగ్స్ ను ఓవర్ నైట్ ఆటగాళ్లు మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్లు ఆరంభించారు. ఆట ప్రారంభమయ్యాక వీరి జోడి కాసేపు టీమిండియా బౌలింగ్ ను నిలువరించే యత్నం చేసింది.ఈ క్రమంలోనే వేడ్-స్టార్క్ల జోడి 49 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే ఆసీస్ స్కోరు 269 పరుగుల వద్ద స్టార్క్(26) అవుటైన తరువాత వారి ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. ఆపై మరో ఐదు పరుగుల వ్యవధిలో వేడ్(40)అవుట్ కాగా, లియాన్(0),హజల్వుడ్(1)లు స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. దాంతో ఏడు పరుగుల వ్యవధిలో ఆసీస్ చివరి నాలుగు వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది.ప్రస్తుత ఆసీస్ కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.