Sakshi News home page

బరితెగింపు

Published Mon, Mar 6 2017 10:49 AM

tdp leaders are Bullying to contract teachers

► ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ ప్రలోభాలు
► కాంట్రాక్టు ఉపాధ్యాయులపై ఒత్తిడి
► ఓటు వేయకపోతే రెగ్యులర్‌ చేయమంటూ బెదిరింపులు ప్రైవేట్‌ పాఠశాలలకు అల్టిమేటం
► గుర్తింపు రద్దు చేస్తామంటూ హెచ్చరిక
► ఆదివారం ఒంగోలులో ఉపాధ్యాయులతో టీడీపీ సమావేశం  
► ఓటర్ల ఫోన్‌ నెంబర్లు తెచ్చిన వారికి నగదు బహుమానం
► ఓటేస్తే... పెద్ద మొత్తంలో ముడుపులు


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా అధికార టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వానికి తెరలేపింది. అధికార పార్టీకి ఓటు వేయకపోతే సంగతి తేలుస్తామంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకంగా జిల్లా కేంద్రంలో ఆదివారం ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో ఒంగోలులోని శ్రీనివాస కల్యాణ మండపంలో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రామకృష్ణ, కొండపి ఎమ్మెల్యే స్వామితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కస్తూరిబా పాఠశాలలకు చెందిన 300 మంది ఉపాధ్యాయులను సమావేశానికి బలవంతంగా తరలించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లేయకపోతే కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెన్యువల్‌ లేకుండా చేస్తామని సమావేశంలో టీడీపీ ముఖ్యనేతలు హెచ్చరించారు. అందరికీ సెల్‌మెసేజ్‌లు పెట్టి మరీ సమావేశానికి రప్పించారు. ఆదివారం అని కూడా చూడకుండా స్థానిక టీడీపీ నేతలు బెదిరించి మరీ ఉపాధ్యాయులను టీడీపీ సమావేశానికి పంపించారు. అధికార పార్టీ హెచ్చరికల నేపథ్యంలో విధి లేని పరిస్థితుల్లో కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు సమావేశానికి హాజరయ్యారు. అధికార పార్టీకి కచ్చితంగా ఓట్లేయాల్సిందేనంటూ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి హుకుం జారీ చేశారు. 2, 3 రోజుల్లో జిల్లా స్థాయిలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశానికి సైతం రావాలని టీడీపీ నేతలు ముందస్తుగానే ఉత్తర్వులు జారీ చేశారు. విధి లేని పరిస్థితుల్లో సమావేశంలో హాజరైన పలువురు కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు సాక్షికి ఫోన్‌ చేసి మరీ తమ గోడు వెల్లబోసుకున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యం భరించలేకున్నామని ఎన్నికల కోడ్‌లోనూ వారి ఆగడాలు తప్పడం లేదని వాపోయారు.  

ప్రైవేట్‌ యాజమాన్యాలతో సమావేశం: మరోవైపు అధికార పార్టీ నేతలు ఆదివారం ఒంగోలులోని మంత్రి నారాయణకు చెందిన ఓ కళాశాలలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు వేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. కాదూ కూడదని పీడీఎఫ్‌ అభ్యర్థులకు ఓట్లు వేస్తే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామంటూ బెదిరించారు. అన్ని పాఠశాలల పరిధిలో తాము నమోదు చేయించిన బోగస్‌ ఓట్లన్నీ కచ్చితంగా అధికార పార్టీకి వేసేలా చర్యలు తీసుకోవాలని వారు యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చారు.  

ఓటర్లకు ప్రలోభాలు: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రకరకాల ఆఫర్లను ప్రకటించింది. 2, 3 రోజుల్లో అవగాహన సదస్సు పేరుతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరినీ ఒంగోలుకు తరలించేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఓటర్లకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు తెస్తే ఒక్కొక్క ఫోన్‌ నెంబర్‌కు రూ.200 ఇస్తామంటూ సరికొత్త ఆఫర్‌ను తెరపైకి తెచ్చారు. ఓటర్లకు సంబంధించిన ఎన్ని నంబర్లు తెచ్చి ఇస్తే ... అన్ని రూ.200 ఇస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఓట్లు వేసిన ఓటర్లకు పెద్ద మొత్తంలోనే నగదు లేదా గిఫ్ట్‌లు ఇస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఎంత మొత్తంలో ఇస్తామన్న విషయం కూడా రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆదివారం జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటించినట్లు సమాచారం. నిన్న, మొన్నటి వరకు బోగస్‌ ఓట్లనే నమ్ముకున్న టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలను ఏ మాత్రం పలకరించిన పాపానపోలేదు.

పీడీఎఫ్‌కు వైఎస్సార్‌సీపీ మద్ధతు నేపథ్యంలో..: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీడీఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అధికార పార్టీ నేతలు బెంబేలెత్తిపోయారు. హుటాహుటిన కస్తూరిబా పాఠశాల ఉపాధ్యాయులు,  ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం పెట్టి మరీ ఓట్లేయాలంటూ బెదిరింపుల పర్వానికి తెరలేపారు. రకరకాల పద్ధతుల్లో మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఓట్ల కోసం బెదిరింపుల పర్వానికి తెరలేపడంపై కస్తూరిబా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలతో పాటు ఓటర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement