యువ 'రైడర్స్‌'

28 Jan, 2018 12:49 IST|Sakshi
శివం మావి, నాగర్‌కోటి, శుభ్‌మన్‌ గిల్‌

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా జరుగుతున్న వేలంలో అండర్‌ -19 క్రికెటర్లు కోట్లు కొల్లగొడుతున్నారు. తొలి రోజు వేలంలో  బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌(రూ.1.8 కోట్లు), పేసర్‌ కమలేశ్‌ నాగకోటి(రూ.3.2 కోట్లు)లను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) సొంతం చేసుకోగా, పృథ్వీ షా(రూ.1.2 కోట్లు)ను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ దక్కించుకుంది.  ఇక ఈ రోజు వేలంలో  మరో అండర్‌-19 క్రికెట్‌ ఫాస్ట్‌ బౌలర్‌ శివం మావి(రూ. 3 కోట్లు)ని కేకేఆర్‌ దక్కించుకుంది. అతని కనీస ధర రూ. 20 లక్షలుండగా, రూ. 3 కోట్లు వెచ్చించి కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

అండర్‌-19లో సత్తాచాటుతున్న శివం మావి కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ అతన్ని చివరకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుత భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టులో ఉన్న ముగ్గురు క్రికెటర్లను కేకేఆర్‌ కొనుగోలు చేసినట్లయ్యింది. గత ఐపీఎల్‌ సీజన్లలో సీనియర్‌ క్రికెటర్లపై ఎక్కువ ఆసక్తి కనబరిచిన కేకేఆర్‌.. ఈసారి యువ క్రికెటర్లతో జట్టును నింపే యత్నం చేస్తోంది. దాంతో యువ రైడర్స్‌తో కేకేఆర్‌ పోరుకు సిద్దమవుతోంది.

మరిన్ని వార్తలు