సాహోరే కోహ్లి.. 

2 Aug, 2018 22:47 IST|Sakshi

విరాట్‌ కోహ్లి వీరోచిత సెంచరీ

ఇంగ్లండ్‌ గడ్డపై తొలి శతకం బాదిన టీమిండియా సారథి

ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లండ్‌ బౌలర్లు

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ బౌలర్లకు భారత బ్యాట్స్‌మెన్‌ దాసోహమయ్యారు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మినహా ఎవరూ పరుగులు కాదుకదా క్రీజులో నిలువలేకపోయారు. పుజారాను తప్పించి పొరపాటు చేశారనుకోని అభిమాని ఉండడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న పట్టుదలగా ఆడి కోహ్లి (149; 225 బంతుల్లో 22 ఫోర్లు, 1సిక్సర్‌) సెంచరీ సాధించాడు. 

కోహ్లి కెరీర్‌లోనే ఇదో మరుపురాని సెంచరీగా మిగిలిపోవటం ఖాయం. ఎందుకంటే జట్టు కష్ట సమయంలో ఉండగా, బ్రిటీష్‌ గడ్డపై చెత్త రికార్డుల నేపథ్యలో సరైన సమయంలో సెంచరీ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. అంతకముందు 285/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మలకు తలోవికెట్‌ దక్కింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు విజయ్‌, ధావన్‌లు శుభారంభాన్ని అందించారు. ఈ దశలో టీమిండియాను బ్రిటీష్‌ యువ పేసర్‌ స్యామ్‌ కుర్రాన్‌ దెబ్బ తీశాడు. తొలి వికెట్‌కు 50 పరుగుల జోడించిన అనంతరం కుర్రాన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌(20) వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ బాది ఊపుమీదున్న రాహుల్‌(4)ను కుర్రాన్‌ బోల్తాకొట్టించాడు. ఇక మరో ఎండ్‌లో పట్టుదలగా బ్యాటింగ్‌ చేస్తున్నట్టు కనిపించిన ధావన్‌(26) కూడా కుర్రాన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

జట్టు కష్టసమయంలో ఉన్న  సమయంలో కెప్టెన్‌తో కలిసి వైస్‌ కెప్టెన్‌ రహానే(15) ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతాడని అనుకుంటే పేలవషాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌(0) ఘోరంగా విఫలమయ్యాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా కోహ్లి ఎంతో సంయమనంతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పాండ్యా(22), అశ్విన్‌(10). షమీ(2), ఇషాంత్‌ శర్మ(5), ఉమేశ్‌(1 నాటౌట్‌) ఉడతా భక్తిగా కోహ్లికి సహకారాన్ని అందించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 274 పరుగులకు ఆలౌటై 13 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లండ్‌కు అందించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో కుర్రాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అండర్సన్‌, స్టోక్స్‌, రషీద్‌ తలో రెండు వికెట్లు సాధించారు.         

మరిన్ని వార్తలు