ఆటను కుదిపేసిన వివాదాలు!

23 Dec, 2018 12:58 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తుచేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మరిచిపోయినా పర్వాలేదు కానీ చేసిన తప్పును.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. ఇలా మనదేశంలో ఓ మతంలా ఆరాదించే క్రికెట్‌లో అంతర్జాతీయంగా 2018లో చోటు చేసుకున్న వివాదాలు.. వాటి పర్యవసనాలపై ఓ లుక్కెద్దాం!

1.బాల్‌ ట్యాంపరింగ్‌..
యావత్‌ క్రీడా ప్రపంచం నివ్వెరపోయిన ఘటన. ప్రపంచ క్రికెట్‌ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టిన సంఘటన. క్రీడాస్పూర్తిని దెబ్బతీసిన ఈ వ్యవహారంతో ఆ ఆటగాళ్లు తమ ఇష్టమైన ఆటకే దూరమయ్యేలా చేసిన వివాదం. చివరకు తాము చేసింది ఘోర తప్పిదమని మీడియా ముందు కన్నీళ్లతో పశ్చాతాపం వ్యక్తం చేసేలా చేసిన అతిపెద్ద వివాదస్పద ఘటన. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌, వైస్‌ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌ సూచనల మేరకు సాండ్‌ పేపర్‌తో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. దీనికి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వత్తాసు పలకడం వివాదానికి దారితీసింది. టీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆసీస్‌ ఆటగాళ్ల బండారం బయట పడింది. ఈ ఘటనతో కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డెవిడ్‌ వార్నర్‌లపై ఏడాది నిషేధం పడగా.. యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు ఆటకు దూరం చేసింది. చివరకు ఐపీఎల్‌ లీగ్‌లో కూడా ఆడకుండా చేసింది. 2018లో చోటు చేసుకున్నఅతిపెద్ద వివాదం బాల్‌ ట్యాంపరింగే అనడంలో అతిశయోక్తి లేదు.

2. డేవిడ్‌ వార్నర్‌-డికాక్‌ల మాటల యుద్దం
బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదానికి కారణమైన ఘటన. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో చోటు చేసుకున్న వాడివేడి వాగ్వాదం. ఈ మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్‌ సమయంలో ప్రొటీస్‌ ఆటగాడు డికాక్‌ వ్యక్తిగత దూషణలకు దిగడంతో సహనం కోల్పోయిన వార్నర్‌ అతనిపై నోరుపారేసుకుంటూ దూసుకెళ్లాడు. ఇది అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో వ్యవహారం బయటకు వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన మ్యాచ్‌ రిఫరీ వార్నర్‌కు 75 శాతం మ్యాచ్‌ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్‌ పాయింట్స్‌ విధించారు. ఈ ఘటనతో ఆ సీరిస్‌లో ఆటగాళ్ల మధ్య మొదలైన మాటల యుద్దం చివరకు బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదానికి దారితీసింది. 

3. స్మిత్‌ను నెట్టేసిన రబడా
ఈ ఏడాది అత్యంత వివాదాస్పద ద్వైపాక్షిక సిరీస్‌ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా సిరీసే అని చెప్పాలి. తొలి టెస్ట్‌లో వార్నర్‌-డికాక్‌ల తిట్టుకోగా.. రెండో టెస్ట్‌లో స్మిత్‌- కగిసో రబడాలు కలియబడ్డారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ ఔటవ్వడంతో.. అత్యుత్సాహం ప్రదర్శిన రబడా స్మిత్‌కు ఎదురుగా వెళ్తూ భుజంతో ఢీకోట్టి పెవిలియన్‌ వైపు వెళ్లూ అంటూ సూచించాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో రబడాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్‌ రిఫరీ మూడు డీమెరిట్‌ పాయింట్లతో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో రబడా రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దీనిపై పశ్చాతాపం వ్యక్తం చేసిన రబడా అప్పీల్‌కు వెళ్లడంతో విచారణ జరిపిన ఐసీసీ డీమెరిట్‌ పాయింట్లను మూడు నుంచి ఒకటి తగ్గించింది. దీంతో అతను మ్యాచ్‌లాడెందుకు మార్గం సుగుమమైంది. మ్యాచ్‌ ఫీజు విషయంలో కూడా 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో స్మిత్‌ అసహనం వ్యక్తం చేశాడు.

4. మహ్మద్‌ షమీపై లైంగిక ఆరోపణలు
టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ స్త్రీలోలుడని అతని భార్య హసీన్‌ జహాన్‌ చేసిన సంచలన ఆరోపణలు అతని కెరీర్‌ను ప్రశ్నార్థకంలో నెట్టాయి. అతను పలువురి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని మీడియా ముందే బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వకుండా పునరాలోచనలో పడేలా చేశాయి. హసీన్‌ జహాన్‌ వ్యవహారంతో విచారణ జరిపిన బీసీసీఐ.. షమీ ఎలాంటి తప్పిదం చేయలేదని క్లీన్‌చీట్‌ ఇచ్చింది. ఇక తనను షమీ మానిసికంగా.. లైంగికంగా వేధించాడని, చంపాలని ప్రయత్నించాడని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో జహాన్‌ను షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం షమీకి దూరంగా ఉంటున్న జహాన్‌.. కూతురు పోషణ కోసం భరణం చెల్లించాలని కోర్టులో పోరాడుతోంది.
 
5. నాగిని డ్యాన్స్‌ వివాదం..
నిదహాస్‌ ముక్కోణపు టోర్నీలో నాగిని డ్యాన్స్‌ వివాదం చర్చనీయాంశమైంది. శ్రీలకం-బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు మైదానంలో గెలిచినప్పుడు నాగిని డ్యాన్స్‌, వికెట్‌ తీసినప్పుడు నాదస్వరం ఊదినట్లు హావభావాలు వ్యక్తపరచడం అభిమానులను ఆకట్టుకుంది. కానీ ఇది చివరకు వివాదానికి దారి తీసింది. ఈ టోర్నీలో బంగ్లా-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతుల వివాదం చోటు చేసుకుంది. చివరి ఓవర్‌ బంగ్లా గెలవాలంటే  12 పరుగులు చేయాలి. ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు వెళ్తారు. 

క్రీజులో ముస్తఫిజుర్‌. బౌలర్‌ ఉదాన. తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్‌’ ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు. మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్‌ చేయలేకపోయిన ముస్తఫిజుర్‌ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు నురుల్‌ శ్రీలంక కెప్టెన్‌ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు కలగజేసుకుని సర్ది చెప్పారు. ఈలోగా కెప్టెన్‌ షకీబ్‌ సహా బంగ్లా ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చేశారు. షకీబ్‌ అంపైర్లతోనూ తీవ్ర వాదులాటకు దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్‌మెన్‌ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్‌ ఖాలెద్‌ మెహమూద్‌ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్‌ ముగిశాక బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌లతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యవహారంలో షకీబ్‌ అల్‌ హసన్‌, రిజర్వ్‌ ప్లేయర్‌ నురుల్‌ హసన్‌లపై మ్యాచ్‌ రిఫరీ వారి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించాడు.

6.  దేశం విడిచి వెళ్లిపో కామెంట్‌..
ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ఓ కామెంట్‌ వివాదానికి దారి తీసింది. నవంబర్‌ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి భారత క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్‌ .. ‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో.’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

7. మిథాలీ ఆవేదన..
మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత సీనియర్‌ క్రికెటర్‌, వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, హెడ్‌ కోచ్‌ రమేశ్‌ పవార్‌ల మధ్య నెలకొన్న వివాదం మహిళా క్రికెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ  ఆధిపత్య పోరు చివరకు భారత మహిళలు ప్రపంచకప్‌ గెలిచే సువర్ణావకాశం కోల్పోయేలా చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్‌ రమేశ్‌ పవార్‌, మాజీ కెప్టెన్‌, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్‌ డయానా ఎడుల్జీల హస్తం ఉందని మిథాలీ రాజ్‌ ఆరోపించడంతో ఈ వివాదం వెలుగు చూసింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్‌ రమేశ్‌ పొవార్‌ వ్యవహరించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తన పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ కన్నీటి పర్యంతమైంది.

కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్‌ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని మిథాలీ రాజ్‌ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్‌ తెలపడం మరింత అగ్గి రాజేసింది. అయితే మరొకసారి పొవార్‌నే కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధానలు కోరడంతో ఆటగాళ్ల మధ్య నెలకొన్న లుకలుకలు బయటపడ్డాయి. బీసీసీఐ మాత్రం పొవార్‌ను తప్పించి కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను నియమించింది. 

8. ఇషాంత్‌-రవీంద్ర జడేజా వాగ్వాదం
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్‌ టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్‌ శర్మ- రవీంద్ర జడేజాలు మైదానంలో గొడవపడటం హాట్‌ టాపిక్‌ అయింది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో రోజు (సోమవారం) ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ మార్పులో తలెత్తిన వివాదం ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. అయితే వీరి వాగ్వాదాన్ని గమనించిన పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ, డ్రింక్స్‌ అందివ్వడానికి మైదానంలోకి వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌లు వారికి సర్ధిచెప్పారు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా లేనప్పటికి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు. దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో.. జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. వీరి మాటలు స్టంప్స్‌లో రికార్డవ్వడం.. ఈ దృశ్యాలను సదరు బ్రాడ్‌కాస్టర్‌ ప్రసారం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారం అంత పెద్దది కాదని, ఆటగాళ్ల ఎలాంటి హద్దులు దాటలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

9. విరాట్‌ కోహ్లి-టిమ్‌ పైన్‌ మాటల యుద్దం
పెర్త్‌ టెస్ట్‌ల్లోనే ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్దానికి దిగారు. మైదానంలో వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్‌ బదులిచ్చాడు! ఈ వ్యవహారంతో అంపైర్‌ క్రిస్‌ గాఫ్‌నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్‌ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్‌ మళ్లీ అడ్డుకున్నారు.

కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్‌ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్‌ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఘటనలో ఇరుజట్ల ఆటగాళ్లు హద్దులు దాటలేదని, ఇవి ఆటలో సర్వసాధారణమే అని కొట్టిపారేశారు. కానీ ఆసీస్‌ మీడియా మాత్రం ఈ ఘటనలో కెప్టెన్‌ కోహ్లిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసింది.
- శివ ఉప్పల

మరిన్ని వార్తలు