క్రికెట్ ఆస్ట్రేలియాపై చర్యలకు మికీ ఆర్థర్ సిద్ధం

13 Jul, 2013 22:17 IST|Sakshi

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ పదవిని అనూహ్యంగా కోల్పోయిన మికీ ఆర్థర్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై చర్యలకు సిద్ధమయ్యాడు. తనతో కాంట్రాక్ట్ నిబంధనలను సీఏ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించాలని అతను వారిపై దావా వేయబోతున్నాడు. ఇందు కోసం ఒక న్యాయ నిపుణుల టీమ్‌ను ఆర్థర్ నియమించుకున్నాడు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం 2015 వన్డే ప్రపంచ కప్ వరకు ఆసీస్ జట్టుకు ఆర్థర్ కోచ్‌గా కొనసాగాల్సి ఉంది. అయితే క్రమశిక్షణ తప్పడం, నిలకడలేమి, బాధ్యతారాహిత్యం వంటి కారణాలు చూపుతూ గత నెలలో అతడిని సీఏ తప్పించింది.

తన కాంట్రాక్ట్ రద్దు చేయడంపై ఎలాంటి నోటీసు, కనీస సమాచారం కూడా తనకు ఇవ్వలేదని, ఇది కాంట్రాక్టు ఉల్లంఘనగానే పరిగణించాలని ఆర్థర్ లాయర్లు వాదిస్తున్నారు. అయితే న్యాయస్థానం వరకు చేరకుండా ఆర్థర్, సీఏ మధ్య చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. మికీ కోచ్‌గా పని చేసిన సమయంలో 19 టెస్టుల్లో ఆస్ట్రేలియా 10 నెగ్గింది. అయితే భారత్ చేతిలో 0-4 తేడాతో పరాజయంతో పాటు ఈ సిరీస్ సందర్భంగా ‘హోమ్‌వర్క్’ చేయలేదంటూ క్రికెటర్లను సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది.

మరిన్ని వార్తలు