భారత్ వైఫల్యానికీ, కోహ్లికీ సంబంధంలేదు: ధోనీ

27 Mar, 2015 11:50 IST|Sakshi
భారత్ వైఫల్యానికీ, కోహ్లికీ సంబంధంలేదు: ధోనీ

సిడ్నీ: ప్రపంచకప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యాన్ని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెనకేసుకొచ్చాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 328 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 329 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లి కేవలం 1 పరుగు చేసి తీవ్ర నిరాశకు గురి చేశాడు.

 

ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ధోనీని ప్రశ్నించగా...ఒకసారి ప్రత్యర్థి జట్టు 300 పై చిలుకు స్కోర్ చేసినపుడు అందునా ఆస్ట్రేలియా లాంటి  బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే అప్పుడప్పుడూ కొంత రిస్క్ తీసుకోకతప్పదు. అలాంటి సందర్భాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఇవన్నీ క్రికెట్ లో సర్వసాధారణం అని సమాధానమిచ్చాడు.

ఆటగాళ్ల ఫిట్ నెస్ పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ...జట్టంతా వందశాతం ఫిట్గానే ఉందన్నాడు. విజయం సాధించడం మీకు కష్టమనిపించిందని విలేకరులు అడిగిన ప్రశ్నకు...మూడో వికెట్ పడిన తరువాత ఇక లక్ష్యాన్ని చేదించడం కష్టమని నాకర్థమైందని చెప్పాడు.

ఫాస్ట్ బౌలర్ల వైఫల్యంపై సమాధానమిస్తూ...వారు సరిగ్గానే బౌలింగ్ చేశారు. టాస్ ఓడిన వెంటనే కొంత బాధపడ్డాను. స్పిన్నర్లు సరిగా రాణించకపోవచ్చని నాకనిపించింది. అయితే రవీంద్ర జడేజా, అశ్విన్ బాగా బౌలింగ్ చేస్తారని ఆశించాను. పిచ్ రివర్స్ స్వింగ్ కు అనుకూలించడంతో స్పిన్నర్ల కంటే  ఫాస్ట్ బౌలర్లే బెటర్ అని అభిప్రాయపడ్డాను.  ఆస్ట్రేలియా 328 పరుగులకు కట్టడి చేసినప్పుడు దాన్ని ఛేదించడం కష్టం కాదనిపించింది. అదే సమయంలో మాపై ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.  ఇలాంటి లక్ష్యాలు ఛేదించాలంటే కొన్ని కీలక భాగస్వామ్యాలు కావాలి అని ధోనీ సమాధానమిచ్చాడు.

మరిన్ని వార్తలు