'నా మొదటి వ్యక్తి ధోనినే'

19 May, 2017 18:39 IST|Sakshi
'నా మొదటి వ్యక్తి ధోనినే'

బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ కు చేరడంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పాత్ర వెలకట్టలేనిది. ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సుందర్ మూడు కీలక వికెట్లతో సత్తా చాటుకున్నాడు. ముంబైకు ఆదిలోనే సుందర్ షాక్ తగలడంతో ఆ జట్టు ఇక తేరుకోలేక ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న సుందర్.. మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాడితో కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

' గేమ్ జరిగేటప్పుడు నాకు ఏ సందేహం వచ్చినా నేను మొదటి వెళ్లేది ధోని దగ్గరకే. ప్రధానంగా ధోని వద్దకు వెళ్లి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ గురించి అడిగి తెలుసుకునే వాడిని. ఓ దిగ్గజ ఆటగాడితో కలిసి ఆడటం నా అదృష్టం. ఆ తరహా పెద్ద స్టార్ల సరసన ఆడే అవకాశం అందరికీ రాదు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. పుణె జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ల సహకారం మరవలేనిది. నేను పవర్ ప్లే లో బౌలింగ్ చేయడాన్ని ఛాలెంజ్ గా భావిస్తా. గౌతం గంభీర్, శిఖర్ ధావన్ తరహా ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఒక సవాల్. వారికి బౌలింగ్ చేయడంలో నేను విజయం సాధించానని అనుకుంటున్నా. నేను ఐపీఎల్లో అరంగేట్రం చేసేటప్పుడు రవి చంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగలనని  అస్సలు అనుకోలేదు' అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు