భళారే... బుమ్రా

30 Apr, 2017 02:05 IST|Sakshi
భళారే... బుమ్రా

► ‘సూపర్‌ ఓవర్‌’లో నెగ్గిన ముంబై ఇండియన్స్‌
► పోరాడి ఓడిన గుజరాత్‌ లయన్స్‌  


రాజ్‌కోట్‌: లక్ష్యం 154 పరుగులే అయినా చిట్టచివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేగిన గుజరాత్‌ లయన్స్, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ చివరకు ‘టై’గా ముగిసింది. దీంతో పదో సీజన్‌లో తొలిసారిగా ‘సూపర్‌ ఓవర్‌’ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు నెగ్గింది. ‘సూపర్‌ ఓవర్‌’ లో ముంబై జట్టు పొలార్డ్, బట్లర్‌ వికెట్లు (ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కే అవకాశం) కోల్పోయి 5 బంతుల్లో 11 పరుగులు చేసింది.

ఆ తర్వాత 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ లయన్స్‌ బుమ్రా వేసిన ‘సూపర్‌’ ఓవర్‌లో మెకల్లమ్, ఫించ్‌ పూర్తిగా తడబడి ఆరు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. పైగా ఇందులో ఓ నోబ్, ఓ వైడ్‌ కూడా ఉండడం విశేషం. అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జడేజా (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కృనాల్‌ పాండ్యాకు మూడు, మలింగ.. బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో  153 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్‌ పటేల్‌ (44 బంతుల్లో 70; 9 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన కృనాల్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

చివర్లో మెరుపులు...
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఆరంభం నుంచే తడబడింది. ఆడుతోంది సొంత గడ్డపైనే అయినా టాప్‌ ఆర్డర్‌ కనీసం పవర్‌ప్లే ఓవర్లు కూడా ఆడలేకపోయింది. మెకల్లమ్‌ (6), రైనా (1), ఫించ్‌ (0), దినేష్‌ కార్తీక్‌ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో లయన్స్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ మాత్రం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చూడచక్కని షాట్లతో విరుచుకుపడిన తను మూడో ఓవర్‌లో వరుసగా ఓ సిక్స్, రెండు ఫోర్లతో పాటు ఆ తర్వాత ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొద్దిసేపు సహకారం అందించాడు.

దూకుడు మీదున్న ఇషాన్‌ కిషన్‌ను 12వ ఓవర్‌లో హర్భజన్‌ పెవిలియన్‌కు పంపాడు. 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 102 పరుగులతో ఉన్న జట్టు స్కోరును ఆండ్రూ టై, ఫాల్క్‌నర్‌ ఉరకలెత్తించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటగలిగింది. 18వ ఓవర్‌లో ఫాల్క్‌నర్‌ ఓ ఫోర్, ఆండ్రూ టై రెండు సిక్సర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయినా అప్పటికే ఎనిమిదో వికెట్‌కు 43 పరుగులు వచ్చాయి.

తడబాటు...
లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లతో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. మూడో ఓవర్‌లో పార్థివ్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. నాలుగో ఓవర్‌లో బట్లర్‌ (9) వెనుదిరగ్గా నితీశ్‌ రాణా (16 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా త్వరగానే అవుటయ్యాడు. అటు పార్థివ్‌ 32 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అయితే పవర్‌ప్లే అనంతరం ఒక్కసారిగా ముంబై స్కోరులో వేగం తగ్గింది. దీనికి తోడు 14వ ఓవర్‌లో  ఫాల్క్‌నర్‌.. కెప్టెన్‌ రోహిత్‌ (5), పార్థివ్‌ను అవుట్‌ చేయడంతో ఒత్తిడి పెరిగింది. చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు రావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో థంపి.. హార్దిక్‌ (4), హర్భజన్‌ను అవుట్‌ చేయగా, మెక్లీనగన్‌ (1) రనౌట్‌ అయ్యాడు.

టై అయ్యింది ఇలా...
ఇక ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా తొలి బంతిని కృనాల్‌ సిక్సర్‌ కొట్టగా... రెండో బంతికి సింగిల్‌ వచ్చింది. అయితే మూడో బంతికి బుమ్రా అవుటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు... ఐదో బంతికి సింగిల్‌ వచ్చాయి. చివరి బంతికి కృనాల్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయ్యింది.  

స్కోరు వివరాలు
గుజరాత్‌ లయన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) పొలార్డ్‌ (బి) హర్భజన్‌ 48; మెకల్లమ్‌ (బి) మలింగ 6; రైనా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 1; ఫించ్‌ (బి) మలింగ 0; కార్తీక్‌ (స్టంప్డ్‌) పార్థివ్‌ (బి) కృనాల్‌ పాండ్యా 2; జడేజా (సి) అండ్‌ (బి) కృనాల్‌ పాండ్యా 28; ఫాల్క్‌నర్‌ (బి) బుమ్రా 21; ఇర్ఫాన్‌ పఠాన్‌ (సి) హారిద్‌క్‌ పాండ్యా (బి) కృనాల్‌ పాండ్యా 2; ఆండ్రూ టై రనౌట్‌ 25; బాసిల్‌ థంపి నాటౌట్‌ 2; అంకిత్‌ సోని నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153.
వికెట్ల పతనం: 1–21, 2–46, 3–48, 4–56, 5–83, 6–95, 7–101, 8–144, 9–144.
బౌలింగ్‌: మెక్లీనగన్‌ 4–0–50–0, మలింగ 4–0–33–2, హర్భజన్‌ 4–0–23–1, బుమ్రా 4–0–32–2, కృనాల్‌ పాండ్యా 4–0–14–3.
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: పార్థివ్‌ (సి) కార్తీక్‌ (బి) ఫాల్క్‌నర్‌ 70; బట్లర్‌ రనౌట్‌ 9; నితీశ్‌ రాణా ఎల్బీడబ్ల్యూ (బి) అంకిత్‌ 19, రోహిత్‌ శర్మ (సి)కార్తీక్‌ (బి) ఫాల్క్‌నర్‌ 5, పొలార్డ్‌ (సి) మెకల్లమ్‌ (బి) బాసిల్‌ థంపి 15; కృనాల్‌ పాండ్యా రనౌట్‌ 29; హార్దిక్‌ పాండ్యా (సి) కిషన్‌ (బి) బాసిల్‌ థంపి 4; హర్భజన్‌ ఎల్బీడబ్ల్యూ (బి) బాసిల్‌ థంపి 0; మెక్లీనగన్‌ రనౌట్‌ 1; బుమ్రా రనౌట్‌ 0; మలింగ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 153.
వికెట్ల పతనం: 1–43, 2–82, 3–104, 4–109, 5–127, 6–139, 7–142, 8–143, 9–150, 10–153
బౌలింగ్‌: బాసిల్‌ థంపి 4–0–29–3, ఫాల్క్‌నర్‌ 4–0–34–2, ఇర్ఫాన్‌ 2–0–26–0, అంకిత్‌ 4–0–16–1, రైనా 4–0–28–0, ఆండ్రూ టై 1–0–9–0, జడేజా 1–0–11–0.

మరిన్ని వార్తలు