తప్పించుకోవాలని చూడటం లేదు

6 Feb, 2016 01:23 IST|Sakshi
తప్పించుకోవాలని చూడటం లేదు

న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడానికి కాస్త సమయం పడుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము తప్పించుకోవడానికి మార్గాలు వెతకడం లేదన్నారు. అయితే అమలు చేసే ముందు నివేదికకు సంబంధించిన మంచి, చెడులను చెప్పే హక్కు తమకుందని తెలిపారు. ‘బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని మేం కూడా నమ్ముతున్నాం. గత తొమ్మిది నెలలుగా అదే పని చేస్తున్నాం. మేం సరైన దిశలోనే వెళ్తున్నామని మా పనులే చెబుతున్నాయి.

లోధా కమిటీ చాలా ప్రతిపాదనలు చేసింది. అయితే అందులో మంచేదో, చెడేదో చెప్పే హక్కు మాకుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు. లోధా కమిటీ ప్రతిపాదనల్లో సహేతుకతపై తాను స్పందించనని చెప్పారు. ఓవరాల్‌గా కమిటీ ప్రతిపాదనలపై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసిన కార్యదర్శి గత 30, 40 ఏళ్లుగా బీసీసీఐలో జరుగుతున్నదంతా తప్పే అంటే ఎలా అని, జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ప్రతిపాదనలను బోర్డు న్యాయబృందం పరిశీలిస్తోందని, ఈనెల 7న దీనిపై తమ ఉద్దేశాలను వెల్లడిస్తామని చెప్పారు.
 
సోమవారం తుది గడువు: టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను పొందేందుకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు బీసీసీఐ సోమవారం వరకు తుది గడువు ఇచ్చింది. ఈ లోగా అన్ని అంశాలకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు సమర్పించకపోతే ప్లాన్-బిని అమలు చేస్తామని ఠాకూర్ వెల్లడించారు. మరోవైపు కోట్లా స్టేడియంలో జరుగుతున్న పనులను కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం పరిశీలించనున్నారు. అలాగే డీడీసీఏ దాఖలు చేసిన ఎన్‌ఓసీ, స్టేడియం పనుల పురోగతిపై కూడా ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

మరిన్ని వార్తలు