మొన్న కోహ్లి.. నిన్న శుక్లా!

22 Jul, 2017 11:46 IST|Sakshi
మొన్న కోహ్లి.. నిన్న శుక్లా!

ముంబై:మహిళల వన్డే ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరడంతో అటు ప్రముఖులు, ఇటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజా వరల్డ్ కప్ సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఓడించి భారత మహిళలు తుదిపోరుకు అర్హత సాధించారు. ఆసీస్ పై 36 పరుగుల తేడాతో గెలిచి కోట్లాది భారత అభిమానుల హృదయాలను దోచుకున్నారు. అయితే ఐపీఎల్ చైర్మన్, ఎంపీ రాజీవ్ శుక్లా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 'చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ పై గెలిచి ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. ఆ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది'అని ట్వీట్ చేశారు.


ఇలా పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే శుక్లాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. అసలు ఏ టోర్నీ జరుగుతుందో కూడా తెలియకుండా రాజీవ్ శుక్లా ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. ట్వీట్ చేసేముందు ఒకసారి సరిచూసుకో అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. క్రికెట్ వర్గానికి చెందిన వ్యక్తే ఇలా చేయడంపై సమర్ధనీయం కాదంటూ పలువురు విమర్శలు సంధించారు.  దాంతో తను చేసిన తప్పును గ్రహించిన శుక్లా.. దాన్ని కొద్ది నిమిషాల్లోనే తొలగించారు.

అంతకుముందు ఇదే ప్రపంచకప్ లో మిథాలీ రాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పూనమ్ రౌత్ ఫోటోను పోస్ట్ చేసి  భారత పురుష క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.  మహిళల క్రికెట్ లో అత్యధిక వన్డే పరుగుల రికార్డును సాధించిన క్రమంలో మిథాలీ రాజ్ ఫోటోకు బదులు పూనమ్ ఫోటోను కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు రాజీవ్ శుక్లా తప్పులో కాలేయడంపై భారత అభిమానుల ఆగ్రహం మరింత ఎక్కువైంది. అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తున్న మహిళా క్రికెట్ జట్టు అంటే ఇంతటి చిన్నచూపా అంటూ మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు