భారత క్రికెట్‌లో సంచలనం

2 Jun, 2017 17:19 IST|Sakshi
భారత క్రికెట్‌లో సంచలనం

బీసీసీఐ తీరును తప్పుబట్టిన రామచంద్ర గుహ
సూపర్‌స్టార్‌ సంప్రదాయం కొనసాగుతుందని విమర్శ
ధోనికి  గ్రేడ్‌ ‘ఏ’  కాంట్రాక్టుపై విస్మయం, కోచ్‌ కుంబ్లేకు మద్దతు


న్యూఢిల్లీ: బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నుంచి తప్పుకున్న ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ బాంబు పేల్చారు. సీఓఏ నుంచి తప్పుకున్న మరుసటి రోజే ఏడు కీలక అంశాలతో లేఖాస్త్రాన్ని సంధించారు. భారత్‌ క్రికెట్‌, బీసీసీఐలో కొనసాగుతున్న సూపర్‌స్టార్‌ సంప్రదాయాన్ని తీవ్రంగా విమర్శించారు. టెస్టుల నుంచి రిటైరయిన ఎంఎస్‌ ధోనికి గ్రేడ్‌ ‘ఏ’  కాంట్రాక్టు కొనసాగిస్తుండడాన్ని తప్పుబట్టారు. 2014లో టెస్టు క్రికెట్‌ నుంచి తనంత తానుగా తప్పుకున్న ధోనికి టాప్ గ్రేడ్‌ కొనసాగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెట్‌ ఏజెన్సీలతో సంబంధమున్న గవాస్కర్‌ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు.

కొంత మంది జాతీయ కోచ్‌లకు బీసీసీఐ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్‌ మత్తులో మునిగితేలారని ధ్వజమెత్తారు. టీమిండియా ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లేకు ఆయన బాసటగా నిలిచారు. కుంబ్లే సత్తా ఏమిటో అతడి రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు.

డ్రెస్సింగ్‌ రూములో కుంబ్లే వైఖరిపై కెప్టెన్‌ కోహ్లి సహా సీనియర్‌ ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే కోహ్లి-కుంబ్లే వివాదం పుకారని బీసీసీఐ కొట్టిపారేసింది. వచ్చే నెలతో కుంబ్లే కాంట్రాక్టు ముగుస్తున్నందున కొత్త కోచ్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు వెల్లడించింది.