కోహ్లీకి విశ్రాంతి.. రోహిత్‌కు పగ్గాలు

27 Nov, 2017 17:34 IST|Sakshi

న్యూఢిల్లీ‌: వరుస క్రికెట్‌ సిరీస్‌లు నిర్వహిస్తున్న బీసీసీఐ గజిబిజి షెడ్యూల్‌ను మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ తప్పుపట్టడం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కలిసొచ్చింది. తనకు విశ్రాంతి కావాలని, ఐతే జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ నుంచి విరామం తీసుకోలేదని వ్యాఖ్యానించిన కోహ్లీకి ఎట్టకేలకు కాస్త ఉపశమనం లభించింది. ప్రస్తుత టెస్ట్ సిరీస్ ముగిశాక అదే జట్టుతో డిసెంబర్ 10నుంచి ధర్మశాలలో ప్రారంభం కానున్న మూడు వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో రోహిత్ శర్మను ఆ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

లంకతో మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ముగిసిన అతి స్వల్ప విరామంలో పటిష్ట దక్షిణాఫ్రికాను వారి గడ్డపై ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కాస్త విరామం ఇవ్వాలని, గజిబిజి వరుస షెడ్యూళ్లతో ఆటగాళ్లకే కాదు జట్టుకు నష్టమేనంటూ కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్యలను మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీలు సమర్థించారు. ఈ క్రమంలో లంకతో చివరి టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కు 15 మంది ఆటగాళ్ల జాబితాను వేర్వేరుగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్లు సోమవారం విడుదల చేశారు. టీ20 సిరీస్‌కు కోహ్లీ అందుబాటులోకి వస్తాడు.

తన వివాహాం నేపథ్యంలో లంకతో తొలి టెస్ట్ తర్వాత విరామం తీసుకున్న బౌలర్ భువనేశ్వర్ ఈ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. మరోవైపు లంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజాను వన్డే సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

చివరి టెస్టుకు ఎంపికైన భారత బృందం:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్

వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా, యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్.

మరిన్ని వార్తలు