రంగు రింగ్ల రియో

7 Aug, 2016 02:17 IST|Sakshi
రంగు రింగ్ల రియో

ఘనంగా జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు
సంస్కృతి, చరిత్ర, సంగీత నేపథ్యాన్ని  చాటిన కళాకారులు
పర్యావరణంపై ప్రత్యేక దృష్టి

 ఆర్థికంగా బలహీనత.. రాజకీయంగా అస్థిరత.. నీటి కాలుష్యం.. సౌకర్యాల లేమి.. పెరిగిన నేరాలు.. ఇలా గేమ్స్ నిర్వహణపై అందరికీ సవాలక్ష అనుమానాలు.. వీటన్నింటినీ తట్టుకుని బ్రెజిల్ సగర్వంగా తలెత్తుకు నిలబడింది. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తమకున్న పరిమిత వనరులతోనే ప్రారంభ వేడుకలను అద్భుతంగా జరిపింది. గతంలో జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్‌లోనే కళ్లు చెదిరే రీతిలో ఈవెంట్ నిర్వహించి విశ్వ వ్యాప్తంగా వీక్షకులను అబ్బుర పరిచింది. తమ దేశ సంస్కృతిని, ఘనమైన చరిత్రను ప్రపంచం ముందుంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అందరూ ఆలోచించే విధంగానూ ప్రదర్శన ఇచ్చి తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పింది. ఓవరాల్‌గా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ తరహాలో అందరి మనస్సులను గెలుచుకుని వహ్..బ్రెజిల్ అనిపించుకోగలిగింది.

రియో డి జనీరో: కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో పాటు వేలాది కళాకారుల అచ్చెరువొందే ప్రదర్శనలతో మరకానా స్టేడియం దద్దరిల్లింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన సాంబా డ్యాన్స్‌తో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే... మరోవైపు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన భూతాపం గురించి తెలియజెపుతూ శభాష్ అనిపించుకున్నారు. ప్రపంచంలోనే దట్టమైన అడవులుగా పేరు తెచ్చుకున్న అమెజాన్ మెల్లమెల్లగా ఎలా అంతరించిపోతుందో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించి ఆలోచనల్లో ముంచారు. ఓవరాల్‌గా కేవలం వినోదానికే ప్రాధాన్యత ఇవ్వకుండా సమాజానికి మనం ఏం చేయగలమనే భావనను అందరి మదిలో కలిగించి బ్రెజిల్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. భారత కాలమానప్రకారం శనివారం తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రారంభమైన ఈ 31వ ఒలింపిక్స్ వేడుకలను 70 వేలకు పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించగా...

టీవీల ద్వారా మూడు వందల కోట్ల మంది వీక్షించారు. మార్చ్‌పాస్ట్‌లో షూటర్ అభినవ్ బింద్రా భారత పతాకధారిగా ముందుకు సాగాడు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ మారథాన్‌లో కాంస్యం సాధించిన వాండర్లీ డి లిమా ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించిన గౌరవాన్ని దక్కించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైకేల్ టెమెర్ పోటీలు ప్రారంభమవుతున్నట్టు ప్రకటించారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల ఖర్చులో కేవలం 5 శాతంతోనే బ్రెజిల్ సంబరాలను ఆకట్టుకునే విధంగా జరిపించడం విశేషం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కి మూన్ కూడా ఇందులో పాల్గొన్నారు.

బ్రెజిల్ జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

అనంతరం షో డెరైక్టర్ ఫెర్నాండో మిరెల్లెస్ ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శన ప్రారంభమైంది.

మెటాలిక్ దుస్తులు ధరించిన రోబోటిక్ డ్యాన్సర్లు తొలి ప్రదర్శన ఇచ్చారు. మరోవైపు స్టేడియం పైన ఎరుపు, పసుపు రంగుల్లో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి.

అనేక సంస్కృతుల మేళవింపుతో ఆధునిక బ్రెజిల్ రూపుదిద్దుకున్నదనే కాన్సెప్ట్‌తో ఆఫ్రికా, సిరియా, జపనీస్ కళాకారులు ప్రదర్శన చేశారు.

వేదికపైనే ఆకాశహర్మ్యాలను పోలిన భవంతులపై డ్యాన్స్ చేస్తున్నట్టుగా అందరినీ భ్రమింపచేసిన రూపకం ఆశ్చర్యపరిచింది.

ఫ్యాషన్ ప్రపంచంలో తమ ఘనతను చాటేలా బ్రెజిలియన్ సూపర్ మోడల్ గిసెలె బుండ్‌చెన్ వేదికపై క్యాట్‌వాక్ చేసి అలరించింది.

బ్రెజిల్ స్లమ్‌లో అభివృద్ధి చెందిన పాస్సియో స్ట్రీట్ డ్యాన్స్‌ను పూర్తిగా తెల్ల దుస్తులు ధరించిన నృత్యకారులు అక్కడున్న వారిని చిందేసేలా చేశారు.

బ్రెజిల్‌కు నల్లజాతీయులు చేసిన సేవలకు గుర్తింపుగా ఓ డ్యాన్సర్ కపోయిరా (డ్యాన్స్, ఏరోబాటిక్, మార్షల్ ఆర్ట్స్ కలబోత) ప్రదర్శన చేశాడు.

అనంతరం స్టేడియంలోని ప్రతీ ఒక్కరిని బ్రెజిలియన్ ప్రఖ్యాత మ్యూజిక్ గుస్టోకు డ్యాన్స్ చేయాల్సిందిగా ఆహ్వానించారు.

దీని తర్వాత ప్రదర్శన ఒక్కసారిగా ధరిత్రి భవిష్యత్‌పైకి మారింది.

వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారణ, ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచును అందరికీ అర్థమయ్యే రీతిలో వీడియో రూపంలో ప్రపంచం ముందుంచారు.

అనంతరం 200కు పైగా దేశాలకు చెందిన అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ ద్వారా స్టేడియంలోకి అడుగుపెట్టారు. ఆధునిక ఒలింపిక్స్‌కు ఆద్యులుగా చెప్పుకునే గ్రీస్ దేశానికి చెందిన అథ్లెట్లు ముందుగా వచ్చారు.

ఇక 95వ దే శంగా స్టేడియంలోకి అడుగిడిన భారత్ తరఫున షూటర్ అభినవ్ బింద్రా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రాగా దాదాపు 70 మంది అథ్లెట్లు 24 మంది అధికారులు  అనుసరించారు. పురుష క్రీడాకారులు నేవీ బ్లూ కలర్ బ్లేజర్స్, ప్యాంట్స్.. మహిళా అథ్లెట్స్ బ్లూ బ్లేజర్స్‌తో పాటు సంప్రదాయ చీరలు ధరించి వచ్చారు.

శనివారం మ్యాచ్ కారణంగా భారత పురుషుల హాకీ జట్టు విశ్రాంతి తీసుకోగా ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ ఆటగాళ్లు కూడా వేడుకలకు హాజరుకాలే దు.

పోటీల నుంచి అధికారికంగా నిషేధం విధించిన కువైట్ ఆటగాళ్లు ఐఓసీ పతాకంతో అడుగుపెట్టారు.

అందరిలోకి టోంగా దేశం తరఫున పతాకధారిగా వచ్చిన పిటా తౌఫాటోఫువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తైక్వాండో అథ్లెట్ అయిన 32 ఏళ్ల తౌఫా తన అధికారిక జెర్సీని వదిలి చాతీపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటికి ఆయిల్ పూసుకుని కింద పొడవాటి స్కర్ట్ ధరించి చేతిలో తమ పతాకంతో స్టేడియంలోకి వచ్చాడు. దీంతో తన వేషధారణతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

తొలిసారిగా ఇరాన్‌కు చెందిన మహిళా అథ్లెట్ జహ్రా నెమటి తమ పతాకంతో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. ఇస్లామిక్ సంప్రదాయాలను కఠినంగా పాటించే ఇరాన్ తమ మహిళా అథ్లెట్లను గతంలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతించేది కాదు.

ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా పాల్గొంటున్న యుద్ధ బాధిత దేశాలకు చెందిన చెందిన శరణార్థి ఒలింపిక్ జట్టుకు స్టేడియంలోని ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు.

చిట్ట చివరిగా ఆతిథ్య దేశానికి చెందిన బ్రెజిల్ అథ్లెట్లు హర్షధ్వానాలతో మరకానాలో అడుగుపెట్టారు.

ఆటగాళ్ల రాక పూర్తయిన తర్వాత పచ్చటి ఆకులతో కూడిన ఒలింపిక్ రింగ్స్‌ను ప్రదర్శించారు.

అనంతరం రియో గేమ్స్ కమిటీ అధ్యక్షుడు కార్లోస్ నుజమన్, ఐఓసీ చీఫ్ బాచ్ ప్రసంగించారు. తమ ఒలింపిక్ కల నిజమైందని కార్లోస్ ఘనంగా చాటారు.

చివరిగా 26 వేల కి.మీ ప్రయాణం అనంతరం రియోకి చేరిన టార్చిని మాజీ టెన్నిస్ స్టార్ గుస్తావో కుయెర్టిన్ స్టేడియంలోకి తీసుకొచ్చి మాజీ బాస్కెట్‌బాల్ ఆటగాడు హోర్టెన్సియా మర్కారికి అందించారు. ఆయన నుంచి వాండర్లే డి లిమా అందుకుని జ్యోతిని వెలిగించడంతో బాణసంచా వెలుగులతో స్టేడియంతో పాటు రియో నగరం ధగధగలాడింది.

>
మరిన్ని వార్తలు