పంత్‌కు వీవీఎస్‌ వార్నింగ్‌!

28 Nov, 2019 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో తరచు విఫలమవుతున్నప్పటికీ టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఎంఎస్‌ ధోనికి వారసుడిగా జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే తనలోని ప్రతిభను చాటుకున్నప్పటికీ, కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నాడు రిషభ్‌. ఆ క్రమంలోనే మరో యువ వికెట్‌ కీపర్‌ సంజూ సాంసన్‌ దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తాచాటడంతో పంత్‌ స్థానంపై డైలమా ఏర్పడింది. సాంసన్‌కు తగినన్ని అవకాశాలు ఇచ్చి పంత్‌ను కొన్నాళ్లు పక్కన పెట్టాలంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంసన్‌ను ఎంపిక చేసినా పంత్‌ను జట్టులో కొనసాగించేందుకు టీమిండియా సెలక్టర్లు మొగ్గుచూపారు. దాంతో పంత్‌కు సాంసన్‌ల మధ్య పోటీ ఒకే సిరీస్‌లో మనకు కనిపించే అవకాశం ఉంది.

ఈ తరుణంలో పంత్‌కు ఒక మెస్సేజ్‌తో కూడిన వార్నింగ్‌ ఇచ్చాడు మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌. ‘ పంత్‌ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెలక్టర్ల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా.. ఇంకా వేరే ఏమైనా జరగుతుందో చూడాలి. ఇప్పుడు సంజూ సాంసన్‌ ఎంపికతో పంత్‌ ప్రదర్శన షురూ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సంజూ సాంసన్‌ ఉన్నాడంటూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలక్షన్‌ కమిటీ ఒక స్ట్రాంగ్‌ మెస్సేజ్‌ను పంత్‌కు పంపినట్లే కనబడుతోంది. ఇప్పటికే పంత్‌కు చాలా అవకాశాలు ఇచ్చారు. దాంతో సాంసన్‌తో పోటీ ఎదుర్కోనున్నాడు పంత్‌. ఇప్పుడు పంత్‌ ఆత్మ రక్షణలో పడబోతున్నాడు.

పంత్‌ నిరూపించుకోవాల్సిన అవసరం మరొకసారి వచ్చింది. సెలక్టర్ల నమ్మకాన్ని గెలవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తూ పంత్‌ రాణించలేకపోతే అతనికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలువుతుంది. పంత్‌పై నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. అతనొక విధ్వంసకర ఆటగాడు. మ్యాచ్‌ను మార్చగల సత్తా పంత్‌లో ఉంది. మంచి బంతుల్ని సైతం బౌండరీలు దాటించే నైపుణ్యం అతని సొంతం. కానీ విండీస్‌తో సిరీస్‌లో పంత్‌ ఆడితేనే అతను కొనసాగే అవకాశం ఉంది’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు