టీమిండియా ఆశాకిరణం అతను..

15 May, 2017 18:14 IST|Sakshi
టీమిండియా ఆశాకిరణం అతను..

న్యూఢిల్లీ: రాబోవు కాలంలో భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రధాన పాత్ర పోషించడం ఖాయమని అంటున్నాడు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్. ఇటీవల కాలంలో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్ .. టీమిండియా ఆశాకిరణంగా ద్రవిడ్ అభివర్ణించాడు. భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయంటూ ద్రవిడ్ జోస్యం చెప్పాడు. ఆ కుర్రాడిలో అసాధారణ ప్రతిభ ఉందనడానికి అతను ఏడాది కాలంగా ఆడిన ఇన్నింగ్స్ లే ఉదాహరణగా పేర్కొన్నాడు. తన తండ్రిని కోల్పోయి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న సమయంలో కూడా ఒక టోర్నీకి దూరం కాకూడదనే రిషబ్ పంత్ చూపించిన తెగువ అతని మానసిక బలాన్ని చూపుతుందని ద్రవిడ్  తెలిపాడు.

'ఈ ఏడాది రిషబ్ పంత్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మంచి ఇన్నింగ్స్ లతో సత్తా చాటుకున్నాడు. అతను కచ్చితంగా టీమిండియా జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఐపీఎల్ టోర్నీకి ముందు అతను తండ్రి మరణించాడు. అది రిషబ్ కు క్లిష్ట సమయం. తండ్రిని పోగుట్టుకున్న బాధలో కూడా టోర్నమెంట్ కు దూరం కాకూడదనుకున్నాడు. అది అతని మానసిక పరిపక్వతను చూపుతుంది'అని ద్రవిడ్ ప్రశంసించాడు.


ఈ సీజన్ లో ఢిల్లీ ఆరు విజయాలతో సరిపెట్టుకోవడంపై ద్రవిడ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఏడాది ఏడు మ్యాచ్ ల్లో గెలిస్తే, ఈ ఏడాది ఆరు మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందడం నిరాశపరిచిందన్నాడు. కనీసం ఎనిమిది మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరే క్రమంలో తాము పోరాడి ఓడిపోయామన్నాడు. చాలా మ్యాచ్ ల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలుకావడం తమ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీసిందన్నాడు.

మరిన్ని వార్తలు