సీడీ ఇస్తే ఆలోచిస్తా: దినకరన్‌ | Sakshi
Sakshi News home page

సీడీ ఇస్తే ఆలోచిస్తా: దినకరన్‌

Published Mon, May 15 2017 5:56 PM

సీడీ ఇస్తే ఆలోచిస్తా: దినకరన్‌

న్యూఢిల్లీ: రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన  కేసులో ఆడియో రికార్డింగ్స్ సీడీ కాపీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టుకు అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ మొర పెట్టుకున్నారు. దినకరన్‌ స్వర నమూనా సేకరిం​చేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మధ్యవర్తి సుఖేశ్‌ చంద్రశేఖర్‌, ఇతరులతో దినకరన్‌ టెలిఫోన్‌లో జరిపిన సంభాషణలకు సంబంధించిన సీడీ నకలును ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు జడ్జి పూనమ్‌ ఛౌదరిని కోరారు. స్వర నమూనా ఇవ్వాలా లేదా అనేది సీడీ పరిశీలించిన తర్వాత చెబుతామని దినకరన్‌ నిర్ణయం తీసుకుంటారని కోర్టుకు ఆయన తరపు లాయర్‌ తెలిపారు. స్వర నమూనా తిరస్కరించే హక్కు నిందితులకు ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయి.

దినకరన్, చంద్రశేఖర్‌ స్వర నామూనాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న కోర్టు విచారించనుంది. మల్లికార్జున బెయిల్‌ పిటిషన్‌ కూడా అదే రోజు విచారణకు రానుంది. కాగా, దినకరన్‌, ఆయన సన్నిహితుడు మల్లికార్జున, హవాలా ఆపరేటర్‌ నాథూ సింగ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు హాజరు పరిచారు. వీరికి విధించిన జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 29 వరకు పొడిగించింది.

Advertisement
Advertisement