‘పరిమిత ఓవర్ల క్రికెట్‌ వల్లే అది సాధ్యం’

8 Oct, 2018 11:36 IST|Sakshi

లాహోర్‌: తన క్రికెట్‌ కెరీర్‌లో ఎప్పుడూ కూడా టెస్టు క్రికెట్‌ను ఎక్కువ ఇష్టపడలేదని పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది స్పష్టం చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో సాధ్యమైనంత మజాను ఆస్వాదించడానికి వెసులుబాటు ఉండదని ఈ సందర్భంగా అఫ్రిది తెలిపాడు. అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌ అంటే తనకు అత్యంత ఇష్టమన్నాడు. ‘ప్రస‍్తుత కాలంలో టెస్టు క్రికెట్‌కు చోటు లేదనేది నా అభిప్రాయం. నా కెరీర్‌లో కూడా టెస్టు క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. సదరు ఫార్మాట్‌లో ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌ అనేది ఉండదని, కాకపోతే నేటి శకంలో ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను బలవంతంగా ఆడతున్నారనే నేను భావిస్తున్నా. నా వరకూ అయితే ఏదైనా ఏదైనా పనిని బలవంతంగా చేయాల్సి రావడాన్ని నేను ఇష్లపడను. ఒక క్రికెటర్‌ తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కాపాడుకోవాలంటే అది పరిమిత ఓవర్ల క్రికెట్‌ వల్లే సాధ్యం. తక్కువ ఓవర్ల క్రికెట్‌ అనేది ఆటగాళ్లకు ఎక్కువగా లాభిస్తుంది’ అని అఫ్రిది పేర్కొన్నాడు.

దాదాపు మూడు నెలల క్రితం గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొన్న అఫ్రిది.. తాజాగా అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాక్తియా పాంథర్స్‌ తరపున ఆడుతున్నాడు. దీనిలో భాగంగా మాట్లాడిన అఫ్రిది టెస్టు క్రికెట్‌పై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ తరపున 27 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో ఎనిమిదివేలకు పైగా పరుగులు, 395 వికెట్లను అఫ్రిది సాధించాడు.

మరిన్ని వార్తలు