తొలుత కుమ్మేసి.. ఆపై కూల్చేశారు!

28 Feb, 2020 14:33 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో అతి పెద్ద విజయం

కాన్‌బెర్రా: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా మరో ఘన విజయాన్ని సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా దక్షిణాఫ్రికా మహిళలు తమ టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద విజయాన్ని(పరుగుల పరంగా)  నమోదు చేశారు. కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయంగా నమోదైంది.

మరొకవైపు మహిళల ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును కూడా సఫారీలు లిఖించారు. ఈ క్రమంలోనే 2018లో న్యూజిలాండ్‌పై భారత్‌ సాధించిన 194 పరుగుల రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ మహిళలు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా, థాయ్‌లాండ్‌ను 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్‌ చేశారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే ఓపెనర్‌ నీకెర్క్‌(2) వికెట్‌ను కోల్పోయింది. (ఇక్కడ చదవండి: టీ20ల్లో షఫాలీ వర్మ నయా రికార్డు)

ఆ తరుణంలో మరో ఓపెనర్‌ లిజెల్లీ లీకి జత కలిసిన ఫస్ట్‌ డౌన్‌ క్రీడాకారిణి సున్‌ లూస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ క్రమంలోనే  లీ  శతకంతో మెరిశారు. 60 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 101 పరుగులు చేశారు. ఇది లిజెల్లీకి తొలి టీ20 సెంచరీ. ఈ క్రమంలోనే లూస్‌తో కలిసి 131 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత లీ పెవిలియన్‌ చేరారు. ఇక చివరి వరకూ లూస్‌((61 నాటౌట్‌; 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకోగా చివర్లో ఖోలే ట్రయాన్‌(24; 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించారు. దాంతో సఫారీలు 196 పరుగుల టార్గెట్‌ను థాయ్‌లాండ్‌కు నిర్దేశించారు. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..)

పసికూన అయిన థాయ్‌లాండ్‌ ఊహించనట్టుగానే ఘోరంగా ఓడిపోయింది. థాయ్‌లాండ్‌ జట్టులో ఒమిచా కామ్‌చొంపు(26),సుతిరుయాంగ్‌(13)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు భారీ ఓటమి ఎదురైంది. సఫారీ బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్లాయిల్‌, సున్‌ లూస్‌లు తలో మూడు వికెట్లతో రాణించి థాయ్‌లాండ్‌ పతనాన్ని శాసించారు. ఎమ్‌లాబా, నీకెర్క్‌, డీక్లెర్క్‌లు వికెట్‌ చొప్పున తీశారు. ఇది సఫారీలకు వరుసగా రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. దాంతో గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా టాప్‌లో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు