మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు

23 May, 2015 11:47 IST|Sakshi
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు

కొలంబో: జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడానికి ప్రతిభే కొలమానం కావచ్చు కానీ బంధుప్రీతి, ప్రాంతీయాభిమానం, సిఫారసులు.. ఇలా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. అయితే జాతీయ జట్టులో స్థానం కావాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనని మహిళా క్రికెటర్లను వేధించారు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే ఈ ఘటన శ్రీలంకలో జరిగింది. గత నవంబరులో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది.

అధికారులు మహిళా క్రికెటర్లను వేధించడం నిజమేనని దర్యాప్తులో తేలినట్టు లంక క్రీడల శాఖ పేర్కొంది. సుప్రీం కోర్టు రిటైర్ట్ జడ్జి నిమల్ దిస్సానాయకే సారథ్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ నివేదికను క్రీడల శాఖకు అందజేసింది. శ్రీలంక మహిళల మేనేజ్మెంట్ టీమ్ సభ్యులు పలువురు మహిళ క్రికెటర్లను లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయని విచారణలో తేలినట్టు లంక క్రీడ శాఖ తెలిపింది. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మహిళా క్రికెటర్లను వేధించిన అధికారుల పేర్లను బయటపెట్టలేదు.

మరిన్ని వార్తలు