కివీస్ ముందు భారీ లక్ష్యం

11 Oct, 2016 13:29 IST|Sakshi
కివీస్ ముందు భారీ లక్ష్యం

మూడో టెస్టును కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. 216 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆతిథ్య కివీస్ జట్టు ముందు 475 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకే చాప చుట్టేసిన వైనం చూస్తే.. మరోసారి అశ్విన్ - జడేజా స్పిన్ జోడీ తమ మంత్రాన్ని పారిస్తే టీమిండియా క్లీన్ స్వీప్ ఖాయంగా కనిపిస్తోంది. భారీ ఆధిక్యం ఉన్నా ఫాలో ఆన్ ఆడించకుండా బ్యాటింగ్ మొదలుపెట్టించిన కోహ్లీ.. అనుకున్నట్లే 200 పరుగులకు పైగా స్కోరు దాటడం, ఫాంలో ఉన్న పుజారా సెంచరీ చేయడం పూర్తి కాగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ మురళీ విజయ్ (19) వికెట్ల వెనుక దొరికేశాడు.

దాంతో అప్పటికి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన గౌతమ్ గంభీర్ మళ్లీ వచ్చి ఈసారి ఏకంగా అర్ధసెంచరీ కొట్టాడు. ఆ తర్వాత జీతన్ పటేల్ బౌలింగ్‌లో ఒక భారీషాట్‌కు ప్రయత్నించి గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ అంపైర్ తప్పిదం కారణంగా 17 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. రీప్లేలో బంతి వికెట్ల అవతలకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అంపైర్ నిర్ణయం పట్ల కోహ్లీ కూడా అసంతృప్తి చెందినట్లు కనిపించింది. మరోవైపు ఛటేశ్వర్ పుజారా వేగంగా ఆడి.. 148 బంతుల్లో 9 ఫోర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అజింక్య రహానే కూడా 20 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండగా.. కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసి, కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

మరిన్ని వార్తలు