ప్రధాన టోర్నీకి అఫ్ఘాన్

13 Mar, 2016 00:35 IST|Sakshi
ప్రధాన టోర్నీకి అఫ్ఘాన్

నిర్ణాయక మ్యాచ్‌లో జింబాబ్వే చిత్తు   టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్
 
నాగ్‌పూర్: సంచలన ఆటతీరుతో విజృంభించిన అఫ్ఘానిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఇప్పటికే స్కాట్లాండ్, హాంకాంగ్‌లను ఓడించిన ఈ జట్టు శనివారం జరిగిన తమ గ్రూప్ ‘బి’ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేను 59 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో వరుసగా హ్యాట్రిక్ విజయాలందుకున్న అఫ్ఘాన్ తమ గ్రూపులో టాపర్‌గా నిలిచింది. ప్రధాన టోర్నీలో ఇంగ్లండ్, శ్రీలంక, విండీస్, దక్షిణాఫ్రికాలతో కూడిన గ్రూపు -1లో అఫ్ఘాన్ చోటు దక్కిం చుకుంది. ఈనెల 17న తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది.

శనివారం నాటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారు ప్రధాన టోర్నీలో ఆడే అవకాశం ఉండడంతో అఫ్ఘాన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 186 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మొహమ్మద్ షెహజాద్ (23 బంతుల్లో 40; 7 ఫోర్లు; 1 సిక్స్)  వేగంగా ఆడినా... మిగిలిన టాపార్డర్ విఫలం కావడంతో అఫ్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మొహమ్మద్ నబీ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 

సమీయుల్లా షెన్వరీ (37 బంతుల్లో 43; 4 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 98 పరుగులు జత చేశాడు. చివరి 10 ఓవర్లలో అఫ్ఘాన్ 113 పరుగులు సాధించింది. పేసర్ పన్యంగర మూడు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. పదో నంబర్ బ్యాట్స్‌మన్ పన్యంగర (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఈ ఆటతీరుతో జింబాబ్వే 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు, హమీద్ హసన్ రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు