పట్టు జారిపోతోంది...

22 Jan, 2016 00:04 IST|Sakshi
పట్టు జారిపోతోంది...

♦ కెప్టెన్‌గా ధోనికి కష్టకాలం
♦జట్టు ఎంపికలోనూ చెల్లని మాట
♦వ్యూహాల్లో గందరగోళం


‘ముగ్గురు ప్రధాన పేసర్లే ధారాళంగా పరుగులిస్తున్నప్పుడు రిషి ధావన్ ఏం చేయగలడు? అతను మరీ వేగంగా కూడా వేయలేడు. జడేజా కాస్త బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ధావన్‌కు అవకాశం ఇవ్వాలంటే అశ్విన్‌ను కూర్చోబెట్టడంవంటి కఠిన నిర్ణయం తీసుకోవాలి. లేదా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ను తప్పించాలి. అప్పుడు ఆరుగురు బౌలర్లవుతారు. కాబట్టి ఇలాంటి స్థితిలో రిషి గురించి ఆలోచించడం లేదు...’ రెండో వన్డే తర్వాత భారత కెప్టెన్ ధోని ఇచ్చిన స్పష్టమైన వివరణ ఇది.

ధోని దృష్టిలో అసలు పనికే రాడనుకున్న రిషి ధావన్ ఆ తర్వాత మూడో వన్డేలో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. ధోని చెప్పినట్లు కఠిన నిర్ణయమే అయినా అశ్విన్‌పై వేటు పడింది. పనిలో పనిగా మరో కొత్త ఆటగాడు గుర్‌కీరత్‌కు కూడా అవకాశం ఇచ్చేందుకు రెగ్యులర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేను పక్కన పెట్టేశారు. ఈ రోజుల్లో సాధ్యం కాదంటూనే ఆరుగురు బౌలర్లను ఆడించేశారు... రెండు రోజుల్లోపే రిషి ఒక్కసారిగా బౌన్స్ రాబట్టగల పేస్ బౌలర్‌గా మారాడా, లేక ధోని మారిపోయాడా.

ఒకప్పుడు రొటేషన్ పేరు చెప్పి సచిన్, సెహ్వాగ్‌లకు కూడా ‘విశ్రాంతి’ ఇవ్వగలిగిన ధోని ఇప్పుడు తనకు నచ్చిన జట్టును ఎంచుకోవడంలో కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. సెలక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేసి ఇచ్చినా... ఇన్నేళ్ల కెప్టెన్సీలో మూడు మ్యాచ్‌ల వ్యవధిలో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ధోని డిక్షనరీలోనే లేదు. గతంలోలాగా అతను స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నాడని, జట్టుపై అతని పట్టు జారుతోందడానికి ఇది తాజా ఉదాహరణ.

సాక్షి క్రీడా విభాగం
సాధారణంగా మ్యాచ్ రోజు ఉదయం మాత్రమే పిచ్‌ను పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వచ్చి తుది జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఇది తప్పనిసరి కాకపోయినా భారత్ ఎప్పుడూ ఒక రోజు ముందుగానే జట్టును నిర్ణయించుకున్న దాఖలాలు లేవు. అయితే మెల్‌బోర్న్ మ్యాచ్ బరిలోకి దిగే వరకు కూడా టీమ్ మేనేజ్‌మెంట్ కనీసం పిచ్ వైపు చూడలేదు. మరో వైపు రిషి ధావన్‌కు మాత్రం తాను తుది జట్టులో ఉండబోతున్నట్లు ముందు రోజే తెలిసిపోయినట్లు సమాచారం. ఇది ఓ రకంగా అనూహ్య నిర్ణయమే. పిచ్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే జట్టును ప్రకటించడం అంటే ముందే ఎవరుండాలో సిద్ధమైపోయినట్లు. రెండో వన్డే తర్వాత ధోని వ్యాఖ్యలపై అతనికి ‘బోర్డు పెద్దలు’ గట్టి క్లాస్ పీకినట్లు  జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది.

జట్టులో ఫలానా ఆటగాడు పనికి రాడు అని బహిరంగంగా అనడం అంటే సెలక్టర్ల నిర్ణయాన్ని సవాల్ చేసినట్లేనని వారు గట్టిగా చెప్పారు. దాంతో చిర్రెత్తిన ధోని మీకు కావాల్సిన వాళ్లనే తీసుకుంటానంటూ నేరుగా రిషిని బరిలోకి దించేశాడు. స్పిన్‌ను అనుకూలమైన ఈ పిచ్‌పై అశ్విన్‌నే పక్కన పెట్టేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో స్పిన్నర్లు జడేజా, మ్యాక్స్‌వెల్ ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఎంపికపై మాట్లాడేందుకు కూడా ధోని నిరాకరించాడు.

భరోసా కల్పించలేకపోతున్నాడు
నాలుగో వన్డేలో జడేజా నాటౌట్‌గా నిలవడం కోసమే నెమ్మదిగా ఆడాడంటూ విమర్శలు వచ్చాయి. జట్టులో మళ్లీ స్థానం కోల్పోతాననే అభద్రతా భావం వల్లే అతను సాహసాలకు పోకుండా నేనైతే ప్రయత్నించాను అన్నట్లుగా బయటపడే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే గతంలోలాగా ఎలా ఆడినా కెప్టెన్ అండగా ఉంటాడు అనే నమ్మకం అతనిలోనూ లేదేమో.

వారం రోజుల క్రితం ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ అంటూ ప్రశంసలు అందుకున్న అశ్విన్‌కు కూడా జట్టులో చోటు లేదంటే ఇక జడేజా ఎంత? పైగా ఎలాంటి కష్టకాలంలోనూ, ఇంతకంటే ఘోరమైన పరాజయాల్లోనూ వెనకేసుకొచ్చిన జడేజాను ధోని నేరుగా విమర్శించడం కూడా ఆశ్చర్యపరిచేదే. గతంలో అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించిన ధోని, ఇప్పుడు తుది జట్టుపై కూడా నమ్మకంతో ఉండలేకపోతున్నాడు.

సాధారణంగా సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేసినా, దేశవాళీలో అతని గణాంకాలు ఎంత గొప్పగా ఉన్నా ఒకటి, రెండు టూర్ల పాటు  మ్యాచ్‌లు ఇవ్వకుండా అనుభవం కోసం తిప్పుకోవడం ధోని శైలి. ఈ సారి మాత్రం భిన్నంగా ఈ సిరీస్ సాగింది.

కెప్టెన్‌గా ప్రకటించినా...
టి20 ప్రపంచకప్‌కు ముందు గందరగోళానికి తెర దించేందుకు ధోనిని అప్పటి వరకు కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆలోగానే అతని కెప్టెన్సీపై ప్రతీ మ్యాచ్‌కు నిఘా పెరుగుతోంది. ఒక వైపు జట్టు పరాజయాలు, మరో వైపు స్వీయ వైఫల్యం, దీనికి తోడు కోహ్లి ఫామ్, అతని టెస్టు రికార్డు... ఇలా అన్నీ మిహీకి వ్యతిరేకంగానే సాగుతున్నాయి. అయితే ఓటమి మాత్రమే కాదు... గత నాలుగు వన్డేలు చూస్తే ధోని కూడా తనకు రోజులు దగ్గర పడ్డట్లే భావిస్తున్నాడా అనిపిస్తోంది.

 గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినా అతను మళ్లీ పెకైగిసాడు. దురదృష్టవశాత్తూ ఈ సారి అతని వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ విఫలం అవుతున్నాయి. ఫలితం సంగతి తర్వాత... ఏదైనా కొత్తగా తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడా అంటే అదీ లేదు. ‘రొటీన్‌కు భిన్నం’లాంటి ఆలోచనలతో అతను మ్యాచ్ దిశను మార్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి  నాయకత్వపు మెరుపు ఒక్కచోట కూడా కనిపించడం లేదు. ఒక రకంగా ఇక చాలు, ఎలా పోతే నాకేం అన్నట్లుగా అతని బాడీలాంగ్వేజ్ ఉంటోంది. చివరి మ్యాచ్‌లోనైనా ‘ కెప్టెన్ ధోని’ ముద్ర కనిపించకపోతే... టెస్టుల్లాగే మిహీ వన్డే కెరీర్ కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మరిన్ని వార్తలు