అంధుల క్రికెట్ ప్రపంచకప్ విజేత భారత్

8 Dec, 2014 00:25 IST|Sakshi

 ఫైనల్లో పాక్‌పై విజయం
 కేప్‌టౌన్ (దక్షిణాఫ్రికా): అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను భారత జట్టు తొలిసారి సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలి చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 40 ఓవర్లలో ఏడు వికెట్లకు 389 పరుగులు సాధించింది.
 
  భారత జట్టు 39.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత్, పాక్‌తోపాటు ఈ టోర్నీలో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. గతంలో దక్షిణాఫ్రికా (1998లో) ఒకసారి, పాకిస్తాన్ (2002, 2006లో) రెండుసార్లు అంధుల ప్రపంచకప్‌ను దక్కించుకున్నాయి. ‘బీసీసీఐ నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా మేము ప్రపంచకప్‌ను నెగ్గినందుకు ఆనందంగా ఉంది. పాక్ క్రికెట్ బోర్డు వద్ద డబ్బు లేకపోయినా ఆ జట్టు ఆటగాళ్లకు నెలసరి వేతనాలు చెల్లిస్తోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 25 లక్షల సహాయం లభించడంతో మేము ఈ టోర్నీలో పాల్గొన్నాం’ అని భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ శేఖర్ నాయక్ వ్యాఖ్యానించాడు.
 

మరిన్ని వార్తలు