మెల్‌బోర్న్‌లో మువ్వన్నెలు 

31 Dec, 2018 03:43 IST|Sakshi

మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం

137 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు

రెండో ఇన్నింగ్స్‌లో 261 ఆలౌట్‌

సిరీస్‌లో కోహ్లి బృందం 2–1తో ఆధిక్యం

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకున్న టీమిండియా

 జనవరి 3 నుంచి నాలుగో టెస్టు  

‘మెల్‌బోర్న్‌ వాతావరణం ఎలా ఉంది’... గత 24 గంటల్లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన అంశాల్లో ఒకటి. ఇందులో భారత క్రికెట్‌ అభిమానులే పెద్ద సంఖ్యలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఎంసీజీలో టీమిండియా విజయం వాకిట నిలిచిన దశలో వాన వస్తే ఎక్కడ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగుస్తుందోనని వారంతా సహజంగానే ఆందోళన చెందారు. అందరూ భయపడినట్లే వర్షం రానే వచ్చింది... తొలి సెషన్‌ను మొత్తం తుడిచి పెట్టేసింది కూడా. కానీ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వరుణుడు కూడా కరుణించలేదు. వాన ఆగిన తర్వాత మ్యాచ్‌ కొనసాగగా మన పేసర్లు బుమ్రా, ఇషాంత్‌ చెలరేగిపోయారు. వర్షానికి మరో అవకాశం ఇవ్వకుండా 27 బంతుల్లోనే ఆట ముగించేశారు... ఫలితంగా మూడో టెస్టులో భారీ విజయం భారత్‌ సొంతమైంది. సిరీస్‌లో 2–1 ఆధిక్యంతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ టీమిండియాను వీడకుండా చెంతనే ఉండిపోయింది. ఇక సిడ్నీలో కూడా ఇదే తరహాలో సత్తా చాటితే ఏడు దశాబ్దాల్లో తొలిసారి కంగారూ గడ్డపై సిరీస్‌ కూడా మన సొంతమవుతుంది.   

మెల్‌బోర్న్‌: ఎంసీజీ మైదానంలో చివరి రోజు లాంఛనం ముగిసింది. ఆసీస్‌ చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో ఆదివారానికి చేరిన మూడో టెస్టు మ్యాచ్‌ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. ఓవర్‌నైట్‌ స్కోరుకు 3 పరుగులు మాత్రమే జత చేయగలిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు ఆసీస్‌ను ఆదుకున్న కమిన్స్‌ (114 బంతుల్లో 63; 5 ఫోర్లు, సిక్స్‌), లయన్‌ (50 బంతుల్లో 7)లను ఎనిమిది బంతుల వ్యవధిలో ఔట్‌ చేసి టీమిండియా గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో నిలవడంతో సిరీస్‌ ఓడిపోయే అవకాశం లేదు కాబట్టి సొంతగడ్డపై 2016–17 సీజన్‌లో గెలుచుకున్న బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ నిలబెట్టుకుంది. మ్యాచ్‌లో 9 వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించిన జస్‌ప్రీత్‌ బుమ్రా (9/86)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది.

 వర్షం వచ్చినా... 
నిర్ణీత సమయం ప్రకారం ఉ.గం.10.30కి (ఆసీస్‌ సమయం) ఆట ప్రారంభం కావాల్సింది. అయితే అంతకు ముందునుంచే కురుస్తున్న వర్షం వల్ల అది సాధ్యం కాలేదు. చిరుజల్లులతో పాటు మధ్యలో కొద్ది సేపు వర్షం జోరుగా కురిసింది. పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్‌ను కూడా కవర్‌ చేసిన అనంతరం అంపైర్లు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. వాన ఆగకపోవడంతో 15 నిమిషాలు ముందుగానే లంచ్‌ విరామం తీసుకున్నారు. అయితే లంచ్‌ సమయంలో వర్షం తగ్గగా, మొత్తంగా 1 గంటా 45 నిమిషాలు ఆలస్యంగా ఆట మొదలైంది.  వర్షం తర్వాత మొదలైన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించేందుకు భారత బౌలర్లకు 4.3 ఓవర్లు మాత్రమే సరిపోయాయి. ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్లో చేసిన మూడు పరుగులే ఆస్ట్రేలియా చివరి రోజు జోడించగలిగింది. రెండు ఓవర్లు మెయిడిన్లుగా ముగిసిన అనంతరం బుమ్రా వేసిన బంతిని కమిన్స్‌ స్లిప్‌లోకి ఆడగా, పుజారా చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు. ఇషాంత్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే పుల్‌ షాట్‌ ఆడబోయి లయన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ విజయం పూర్తయింది.  

భారత జట్టులో నుంచి కోహ్లి, పుజారాలను తీసేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మా పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ మీ వద్ద ఉంటూ కూడా జట్టులో లేకపోతే ఏం చేయగలం. ప్రస్తుతం మాత్రం అందరూ అసహనంతోనే ఉన్నారు. ఇప్పుడు మా ముందు మరో సవాల్‌ నిలిచింది. మేం బ్యాటింగ్‌లో కాసిన్ని ఎక్కువ పరుగులు చేస్తేనే మా బౌలర్లు ఏమైనా చేయగలరు. భారత జట్టులో కూడా లోపాలు ఉన్నాయి. కోహ్లి, పుజారాలను ఔట్‌ చేస్తే పట్టు దక్కించుకోవచ్చు. ఆసీస్‌ గడ్డపై మా బలం పేస్‌ బౌలింగే కాబట్టి బౌన్స్‌ ఉండే పిచ్‌లను మేం ఆశిస్తాం. వారికి అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేసి అప్పగించామేమో అని కొన్ని సార్లు మాకనిపిస్తోంది. భారత్‌లో పచ్చిక ఉండే వికెట్లు సిద్ధం చేయరు కదా. అయితే అన్ని రంగాల్లో రాణించిన భారత్‌కు గెలిచే అర్హత ఉంది. పెర్త్‌ టెస్టు తర్వాత మా ఆట మెరుగైందని భావించాం. కానీ తాజా ఫలితం చాలా నిరాశ కలిగించింది. 
 –టిమ్‌ పైన్, ఆస్ట్రేలియా కెప్టెన్‌   

మేం ఇక్కడితో ఆగిపోదల్చుకోలేదు. సిడ్నీలో మరింత సానుకూల దృక్పథంతో ఆడేందుకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఈ విజయం అందించింది. మేం మూడు విభాగాల్లోనూ బాగా ఆడటం వల్లే ట్రోఫీని నిలబెట్టుకోగలిగాం. తాజా ఫలితం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మా జట్టు బలాన్ని బట్టి చూస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని మాకు గట్టి నమ్మకం ఉంది. నాలుగు, ఐదు రోజుల్లో బ్యాటింగ్‌ చేయడం కష్టం కాబట్టే ఫాలోఆన్‌ ఇవ్వలేదు. ఈ గెలుపు ఘనత అంతా మా బౌలర్లదే. మా దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. ప్రతికూల పరిస్థితుల్లో పాత బంతితో అక్కడ మన బౌలర్లు కనబర్చిన ప్రదర్శన విదేశాల్లో పనికొచ్చింది. పుజారా ఎప్పటిలాగే బాగా ఆడాడు. ఆస్ట్రేలియాలో పరిస్థితులకు అనుగుణంగా అతను తన ఆటను మార్చుకున్నాడు. మయాంక్‌ పట్టుదల చూపించగా, విహారి సుదీర్ఘ సమయం క్రీజ్‌లో పాతుకుపోవడం వల్లే మేం మరింత విశ్వాసంతో బ్యాటింగ్‌ చేయగలిగాం. టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన సంవత్సరం లోపే సత్తా చాటిన బుమ్రా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌. పెర్త్‌లాంటి పిచ్‌పై బుమ్రాను ఎదుర్కోవాలని నేనెప్పుడూ కోరుకోను. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లో తొలిసారి ఆధిక్యం కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. ఇక నాలుగో టెస్టు గెలవకుండా మా ఏకాగ్రతకు ఏదీ భంగం కలిగించలేదు.  –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌   

రోహిత్‌ శర్మకు పుత్రికోత్సాహం..
భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ తండ్రయ్యాడు. అతని భార్య రితిక ఆదివారం రాత్రి ముబైలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితిక బంధువు సీమాఖాన్‌ (బాలీవుడ్‌ నటుడు సోహైల్‌ ఖాన్‌ భార్య) నిర్ధారించింది. ప్రస్తుతం రోహిత్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు.   

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 443/7 డిక్లేర్డ్‌; ఆస్ట్రేలియా తొలి ఇన్నిం గ్స్‌ 151; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 106/8 డిక్లేర్డ్‌; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) మయాంక్‌ (బి) జడేజా 13; ఫించ్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 3; ఖాజా (ఎల్బీ) (బి) షమీ 33; షాన్‌ మార్‌‡్ష (ఎల్బీ) (బి) బుమ్రా 44; హెడ్‌ (బి) ఇషాంత్‌ 34; మిషెల్‌ మార్‌‡్ష (సి) కోహ్లి (బి) జడేజా 10; పైన్‌ (సి) పంత్‌ (బి) జడేజా 26; కమిన్స్‌ (సి) పుజారా (బి) బుమ్రా 63; స్టార్క్‌ (బి) షమీ 18; లయన్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 7; హాజల్‌వుడ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్‌) 261.  
వికెట్ల పతనం: 1–6; 2–33; 3–63; 4–114; 5–135; 6–157; 7–176; 8–215; 9–261; 10–261. 
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 14.3–1–40–2; బుమ్రా 19–3–53–3; జడేజా 32–6–82–3; షమీ 21–2–71–2; విహారి 3–1–7–0.   
 

మరిన్ని వార్తలు