పెరీరా మెరుపులు

25 Sep, 2013 01:28 IST|Sakshi
పెరీరా మెరుపులు

క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.... చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా సంచలన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.
 
 మొహాలీ: ప్రధాన మ్యాచ్‌లకు ఒక్క రోజు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్‌రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్‌తో హైదరాబాద్ జట్టు లీగ్‌లో పాయింట్ల బోణీ చేసింది.
 
  పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్‌తో ట్రినిడాడ్  బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్‌లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్‌లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది.
 
 అంతకు ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్‌దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్‌స్పిన్నర్ కరణ్‌శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
 
 స్కోరు వివరాలు
 ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్‌దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160.
 వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156.
 బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2;  మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2.
 
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164.
 
 వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142.
 బౌలింగ్: రామ్‌పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1.
 
 
 చాంపియన్స్ లీగ్‌లో నేడు
 ఒటాగో   x పెర్త్
 సా. గం. 4.00 నుంచి
 రాజస్థాన్   x లయన్స్
 రా. గం. 8.00 నుంచి
 వేదిక: జైపూర్
 స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

మరిన్ని వార్తలు