అదే నా సక్సెస్కు కారణం :కోహ్లి

6 May, 2016 17:19 IST|Sakshi
అదే నా సక్సెస్కు కారణం :కోహ్లి

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి.. భారత క్రికెట్లో కీలక ఆటగాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తరువాత  టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. ఒత్తిడి లేనప్పుడు, ప్రాధాన్యత లేని మ్యాచ్‌లలో, ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చెలరేగి ఆడే వీర విధ్వంసకారులు ఎంతో మంది ఉన్నారు. కానీ పటిష్ట ప్రత్యర్థులపై ఒత్తిడిలోనూ లక్ష్యాలను మంచినీళ్ల ప్రాయంలా ఛేదించడం కోహ్లికి మాత్రమే సాధ్యం. అయితే విరాట్ ఆట తీరుతో పాటు అతని దూకుడుగా ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మైదానంలో, వెలుపల కూడా దూకుడుగా ఉండే కోహ్లి... టెస్టు కెప్టెన్ అయ్యాక కూడా తన రూటును మార్చుకోలేదు. తనకు అలానే ఉండటం ఇష్టమని, దాంతోనే తన ఆట ఎంతో పరిణితి చెందిందని కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు.


'నా ఆట తీరు మెరుగవడానికి దూకుడే కారణం. ఈరోజు నా ఆట ఉచ్ఛ దశకు చేరడానికి దూకుడే ప్రధాన కారణమని భావిస్తున్నా.  ప్రతీ క్రీడాకారుడికి దూకుడు ఉండాలనేది కూడా నా అభిప్రాయం. అయితే అది సరైన మార్గంలో మాత్రమే ఉండాలి. దురహంకారంతో కూడిన దూకుడు ఉండకూడదు'అని కోహ్లి తెలిపాడు. తాను ఎప్పుడూ రికార్డుల గురించి పట్టించుకోనని, జట్టు గెలుపు కోసమే మాత్రమే ఆడతానని కోహ్లి స్పష్టం చేశాడు. రికార్డులను బ్రేక్ చేయడాన్ని చాలెంజ్ గా తీసుకోకుండా, సహజ సిద్ధంగా ఆడటమే తన నైజమన్నాడు. ఇదిలా ఉండగా, ఒక క్రికెటర్ ఆఫ్ ద ఫీల్డ్ వ్యవహారాల గురించి  పదే పదే మాట్లాడం మంచి పద్దతి కాదని విరాట్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు