ఘనంగా బీసీసీఐ అవార్డుల ప్రదానం

6 Jan, 2016 08:25 IST|Sakshi
ఘనంగా బీసీసీఐ అవార్డుల ప్రదానం

కిర్మాణీకి సీకే నాయుడు  జీవిత సాఫల్య పురస్కారం
కోహ్లికి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
ఉత్తమ సీనియర్ మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్

 ముంబై: ప్రతిష్టాత్మక బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది.బోర్డులోని అత్యున్నత స్థాయి అధికారులంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... పాలీ ఉమ్రిగర్ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్) అవార్డును అందుకున్నాడు. అలాగే క్రికెట్‌కు ఉత్తమ సేవలందించిన దిగ్గజాలకు ఇచ్చే కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీకి అందించారు.
 
 1983 ప్రపంచకప్‌లో కపిల్ సేన విజేతగా నిలువడంతో కీలక పాత్ర పోషించిన 66 ఏళ్ల కిర్మాణీ.. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద ఓ జ్ఞాపిక, రూ.25 లక్షల చెక్‌ను అందించారు. ‘ప్రస్తుత కీపర్లలో టెక్నిక్ ఏమాత్రం కనిపించడం లేదు. ఎక్కువగా విజయంపైనే దృష్టి పెడుతున్నారు. అయితే ధోనికి కీపింగ్ చేసే సామర్థ్యం ఉంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా నా ఆట ఉండాలనే ఉద్దేశం అప్పట్లో ఉండేది. దిగ్గజ స్పిన్ త్రయం ప్రసన్న, చంద్రశేఖర్, బేడి బంతులను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్నిచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని కిర్మాణీ తెలిపారు.
 
 శశాంక్ మనోహర్ చేతుల మీదుగానే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న కోహ్లి.. ఇప్పటిదాకా తన కెరీర్‌లో ఆసీస్ పర్యటనలో ఆడిన టెస్టు సిరీస్ అత్యంత మధుర జ్ఞాపకంగా నిలిచిందని చెప్పాడు. ‘0-2తో ఆ సిరీస్ కోల్పోయినా మా పోరాటాన్ని గొప్పగా ప్రదర్శించాం. జట్టు ఆటగాళ్లందరూ నన్ను అభినందించారు. ఇప్పటిదాకా ఇదే నా జీవితంలో అత్యంత మధుర క్షణాలుగా భావిస్తున్నాను. మున్ముందు కూడా ఇలాగే ఉండాలనుకుంటున్నాను.
 
  పాక్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు 3 వేల మంది అభిమానులు మా హోటల్ ముందు గుమిగూడారు. ఇలాంటి వారి ముందు మ్యాచ్ ఆడబోతున్నాను. బాగా ఆడాలని నాకు నేను సవాల్ విసురుకుని సాధించాను’ అని కోహ్లి చెప్పాడు. ఉత్తమ సీనియర్ మహిళా క్రికెటర్ అవార్డును అందుకోవాల్సి న మిథాలీ కోల్‌కతాలో మ్యాచ్ ఆడుతున్నందున కార్యక్రమానికి రాలేదు.  ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు.
 
 అవార్డుల వివరాలు
 కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం: సయ్యద్ కిర్మాణీ
 పాలీ ఉమ్రిగర్ అవార్డు (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్): విరాట్ కోహ్లి
 లాలా అమర్‌నాథ్ అవార్డులు: ఉత్తమ రంజీ ట్రోఫీ ఆల్ రౌండర్: జలజ్ సక్సేనా
 దేశవాళీ వన్డేల్లో ఉత్తమ ఆల్‌రౌండర్: దీపక్ హుడా
 మాధవ్‌రావ్ సింధియా అవార్డులు: రంజీల్లో అత్యధిక పరుగులు: ఉతప్ప (11 మ్యాచ్‌ల్లో 912)
 అత్యధిక వికెట్లు:
వినయ్ కుమార్, శార్దుల్ ఠాకూర్ (10 మ్యాచ్‌ల్లో 48)
 

మరిన్ని వార్తలు