విరాట్ కు ఆసీస్ దిగ్గజం మద్దతు

13 Mar, 2017 11:46 IST|Sakshi
విరాట్ కు ఆసీస్ దిగ్గజం మద్దతు

సిడ్నీ: రెండో టెస్టు సందర్భంగా ఆసీస్ క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వైఖర్ని ఆ దేశంలోని పలువురు క్రికెటర్లతో పాటు అక్కడి మీడియా  తీవ్రంగా తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.  అయితే దీనికి ముందు అదే టెస్టులో ఆసీస్ ఓపెనర్ రెన్ షాను 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ కు దిగిన విరాట్ కోహ్లిపై ఆ దేశ క్రికెటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా, ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ నుంచి అనూహ్య మద్దతు లభించించింది. ప్రధానంగా విరాట్ తన చర్యలతో గౌరవాన్ని కోల్పోతున్నాడంటూ ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ వ్యాఖ్యలతో హేడెన్ విభేదించాడు. క్రమశిక్షణ,  టెంపర్మెంట్, బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ వంటి అనేక విషయాలు ఆటలో ముడి పడి ఉంటాయని హేడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అవన్నీ ఆటలో భాగంగానే చూడాలని హేడెన్ పేర్కొన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక గుర్తింపు పొందిన ఆటగాడు గౌరవం కోల్పోవడం ఉండదని తన అభిప్రాయంగా పేర్కొన్నాడు. ఆ గేమ్ లో విరాట్ శ్రుతి మించి వ్యవహరించలేదన్నాడు. తాను ఎప్పుడూ ఆడినా దూకుడుగా ఉంటూ ప్రత్యర్ధి ఆటగాళ్ల నుంచి గౌరవాన్ని సంపాదించుకునే వాడినని, విరాట్ విషయంలో కూడా ఇప్పడు అదే జరుగుతుందని హేడెన్ తెలిపాడు.

తమతో రెండో టెస్టు సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు కించపరిచే విధంగా ఉందని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ మండిపడ్డాడు. ఒక జట్టుకు కెప్టెన్ గా ఉన్న  విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి ఆటగాడ్ని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం  అగౌరపరచడమేనని విమర్శించాడు. దాంతో పాటు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పట్ల కోహ్లి వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నాడు. ఈ తరహా  మాటల యుద్ధానికి విరాట్ ఫుల్ స్టాప్ పెట్టి.. తన సహజసిద్ధమైన ఆటను ప్రదర్శిస్తే బాగుంటుందన్నాడు. ఒత్తిడికి లోనవుతున్న విరాట్ తన గౌరవాన్ని కూడా కోల్పోతున్నట్లు కనబడుతుందని హేలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
 

>
మరిన్ని వార్తలు