రోహిత్‌ను దాటేశాడు..

19 Sep, 2019 10:40 IST|Sakshi

మొహాలీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో అజేయంగా 72 పరుగులు నమోదు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ఈ క్రమంలోనే పలు ఘనతల్ని నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి 2,441 పరుగులతో టాప్‌కు ఎగబాకాడు. ఇక్కడ మరో భారత ఆటగాడు రోహిత్‌ శర్మను దాటేశాడు. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434  పరుగులు సాధిస్తే, దాన్ని  తాజాగా కోహ్లి బ్రేక్‌ చేశాడు. ఈ వరుసలో మార్టిన్‌ గప్టిల్‌( 2,283-న్యూజిలాండ్‌) మూడో స్థానంలో ఉండగా, షోయబ్‌ మాలిక్‌(2,263-పాకిస్తాన్‌) నాల్గో స్థానంలో ఉన్నాడు. బ్రెండన్‌ మెకల్లమ్‌(2,140-న్యూజిలాండ్‌) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

హాఫ్‌ సెంచరీల్లో కూడా..
అంతర్జాతీయ టీ20 హాఫ్‌ సెంచరీల్లో సైతం రోహిత్‌ను అధిగమించాడు కోహ్లి.  ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ 21 అర్థ శతకాలు సాధిస్తే, కోహ్లి దాన్ని సవరించాడు. కోహ్లి 22 అంతర్జాతీయ హాఫ్‌ సెంచరీలతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో వరుసగా మార్టిన్‌ గప్టిల్‌(16), బ్రెండన్‌ మెకల్లమ్‌(15), క్రిస్‌ గేల్‌(15)లు ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20 ఛేజింగ్‌లో కోహ్లి 30 ఇన్నింగ్స్‌ల్లో 81.23 సగటుతో 1381 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. కోహ్లి 71 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు గాను 66 ఇన్నింగ్స్‌లు ఆడాడు.(ఇక‍్కడ చదవండి: కోహ్లి కొడితే... మొహాలీ మనదే..)

>
మరిన్ని వార్తలు